బీజేపీ నాయకుడు తిరుపతి రెడ్డి మిస్సింగ్ కలకలం

హైదరాబాద్ అల్వాల్ లో బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. తిరుపతిరెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అల్వాల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట తన  భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం (జులై 13న) కిడ్నాప్ చేశారని తిరుపతిరెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు, తిరుపతిరెడ్డి భార్య వివరాల ప్రకారం..

కుషాయిగూడలో కుటుంబ సభ్యులతో ఉంటున్న ముక్కెర తిరుపతిరెడ్డికి పాకాల కుంటలో విలువైన స్థలం ఉంది. కొన్ని నెలల క్రితం స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు తిరుపతిరెడ్డి. ఈ క్రమంలోనే గురువారం (జులై 13న) మధ్యాహ్నం అల్వాల్ తహశీల్దార్ కార్యాలయానికి కారులో తన డ్రైవర్ తో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత డ్రైవర్ పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తిరుపతిరెడ్డి కనిపించలేదు. ఆయన సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో తిరుపతిరెడ్డి భార్య అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థలం వివాదంలో తమ ప్రత్యర్థి వర్గమే తన భర్త తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు తిరుపతిరెడ్డి భార్య. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులపై ఫిర్యాదు చేశారు. 

తిరుపతిరెడ్డి కిడ్నాప్ కేసుపై ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ల్యాండ్ వివాదాలే తిరుపతిరెడ్డి కిడ్నాప్ కు కారణమని పోలీసులు కూడా భావిస్తున్నారు. మామిడి జనార్థన్ అనే వ్యక్తిపై తిరుపతిరెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా జనార్థన్ రెడ్డికి, తిరుపతిరెడ్డికి మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుపతిరెడ్డికి చెందిన మూడు ఎకరాల భూమిని మామిడి జనార్థన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. 

మామిడి జనార్థన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయి. జనార్థన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతో మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేశాడని తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్థన్ రెడ్డే బాధ్యులని హెచ్చరిస్తోంది తిరుపతి రెడ్డి భార్య.