బృందావనపు రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఆనంద వర్ధనుడు. తన రాజ్యంలో ప్రజలకు అనేక పథకాల ద్వారా ఉచితాలు ఇచ్చేవాడు. మంత్రి వద్దని ఎంత వారించినా వినేవాడు కాదు. అయితే ఈ క్రమంలో మహారాజు మౌలిక వసతుల అభివృద్ధిని మర్చిపోయాడు.
ఒకరోజు ప్రత్యక్షంగా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మారువేషంలో రాజ్యంలో ఒక చోటికి వెళ్లి, ‘‘అయ్యా నేను ఈ రాజ్యానికి కొత్త, మీ రాజుగారు నాకేమైనా సాయం చేస్తారేమోనని వచ్చా. మీ రాజు దగ్గరకు వెళ్ళవచ్చా?’’ అని అడిగాడు. అక్కడ ఉన్నవారు ‘‘అయ్యో తప్పకుండా వెళ్లండి. మా మహారాజు చాలా మంచివారు. ఎవరు ఏమి అడిగినా కాదనరు. ప్రజలందరినీ ఎంతో చక్కగా చూసుకుంటున్నారు!’’ అన్నారు. ఆ మాటలు విన్న మారువేషంలో ఉన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
అలాగే మరొక చోటకు వెళ్లాడు.. అక్కడ కూడా ఇలానే రాజును పొగిడారు. అయితే అక్కడ ఒక ముసలాయన మాత్రం ‘‘మహారాజుగారు మంచి మనసు కలవారే. కానీ మహారాజు కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఒక విధమైనటువంటి సోమరితనం ఏర్పడింది. రాజుగారు అన్నీ సమకూరుస్తున్నారనే ధీమా ఉండడంతో కష్టపడడం మానేశారు. ఇది మంచిది కాదు. ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే ఉచిత పథకాలు అందజేసి, మిగిలిన వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది’’ అన్నాడు. ఆ మాటలు విన్న రాజుకి కోపం వచ్చింది. కానీ బయటపడలేదు.
చీకటి పడుతుండడంతో తిరిగి వెళ్లిపోదాం అని భావించిన రాజు అక్కడ దగ్గరలో గల పల్లకి మోసే వారి దగ్గరకు వెళ్లి ‘‘నన్ను మీ పల్లకిలో రాజుగారి ఆస్థానానికి తీసుకువెళ్లగలరా?’’ అని అడిగాడు. ‘‘మేం వెళ్లం’’ అని సమాధానం ఇచ్చారు వాళ్లు. రాజు ‘‘మీకు ఎంత కావాలో చెప్పండి నేను ఇస్తాను’’ అని అనగా ‘‘మీరు మాకేం డబ్బులు ఇవ్వనవసరం లేదు. మా రాజుగారే మాకు ఏ పని చేయకుండా వివిధ ఉచిత పథకాలు ఇస్తున్నారు.
ఇంకా మేము కష్టపడాల్సిన అవసరమేముంది?’’ అన్నారు ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. మరో చోటికి వెళ్లి అడిగినా అక్కడ కూడా అదే రకమైన సమాధానం. అప్పుడు రాజుకు ఇంతకుముందు ముసలాయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఉచిత పథకాల వల్ల అవకాశం ఉన్నా కూడా పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతున్నారని అర్థమైంది.
చేసేదిలేక నడుచుకుంటూనే ఆస్థానానికి చేరుకున్నాడు. వెంటనే మహామంత్రిని పిలిచి ‘‘మహామంత్రి! మీరు చెప్పిన మాట అక్షర సత్యం. మీ మాటలు నేను పెడచెవిన పెట్టడంతో రాజ్యంలోని పరిస్థితులు దారుణంగా మారాయి. నేను స్వయంగా వెళ్లి చూసి వచ్చాను. ఇప్పటినుంచి ఉచిత పథకాలను కేవలం వృద్ధులు, రోగులు వంటి అవసరం గల వారికి మాత్రమే ఇస్తాను. మిగిలిన వాళ్లకు కష్టపడి పని చేయడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించండి’’ అని మహారాజు మంత్రిని ఆదేశించాడు.
అప్పటినుంచి రాజ్యంలో కేవలం అవసరమైన వాళ్లకు మాత్రమే ఉచిత పథకాలను అందించడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్లందరికీ వాళ్ల నైపుణ్యాన్ని అనుసరించి వాళ్లకు కావాల్సిన వసతులను, మౌలిక సౌకర్యాలు కల్పించడంతో రాజ్యంలోని అందరూ బద్దకాన్ని వీడి చక్కగా పనిచేయసాగారు. కొన్ని రోజులకే రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి దూసుకెళ్ళింది. ప్రజలంతా కష్టపడి పనిచేసుకుంటూ హాయిగా జీవించసాగారు.
- ఏడుకొండలు కళ్ళేపల్లి