కార్మికులం కర్షకులం

కార్మికులం కర్షకులం 
కల్మషంలేని శ్రామికులం 
శ్రమను నమ్ముకున్న జీవులం 
నాగరిక ప్రపంచ నిర్మాణ కారకులం 
శ్రమజీవులం చెమటోడ్చే కార్మికులం 
గడీల నుంచి గుడి దాకా 
నిర్మించిన మరమనుషులం 
గుడిలో మోగే గంటల నుంచి గడిలో వినిపించే ఆర్తనాదాలు కూడా మావే అని తెలియని అమాయకులం 
కష్టం మాది, మండుటెండలో 
చమట చుక్కలు మావి 
రాళ్లకింద నలిగి చిందిన రక్తం మాది 
శిలాఫలకాలు మీవి, 
శిథిలాల కింద జీవితాలు మావి 
మా చెమటను కరిగించిన 
బంగారు నాణాలు మీవి 
మా శ్రమకు వెల కట్టి సంపాదించిన ధనరాశులు మీవి 
ఆర్థిక ఊచకోత అనాదిగా అనుభవిస్తున్న కులం 
అదే ప్రగతి అని లోకంలో 
బోధిస్తున్న దోపిడీ కులం 
జండాలు ఎన్నైనా, ఎజెండా ఒక్కటే 
అని తెలవని శ్రామికులం 
వారి జండాలకు కర్రలై, 
తన్నుకున్న  అభాగ్యులం 
శ్రమించే కులం, శ్రమను 
సొమ్ము చేసుకునే కులం
ఇది నిజం మార్క్స్ లెనిన్ మార్గం అని మురిసిపోయిన వాళ్లం 
ఫూలే అంబేద్కర్లను మరిచి మోసపోయిన కలికాల అమాయకులం
ఓటు విలువ తెలవని మూగజీవులం
కర్మ అని సర్దుకుపోయే జీవరాశులం 
కార్మికులం కర్షకులం 
కల్మషంలేని శ్రామికులం 
అదే మా కులం, అదే మా గుణం 
-- డా. బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ, భువనగిరి