సర్కారు వదిలేస్తే.. హైకోర్టు ఆదేశాలతో సర్వే..
వందల కోట్ల విలువైన భూములను కబ్జా పెట్టిన లీడర్లు
వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ నడిబొడ్డున వందల కోట్ల విలువజేసే పద్మాక్షి టెంపుల్ భూముల కబ్జా బాగోతం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల మొదలైన డిజిటల్సర్వే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దేవాదాయశాఖకు చెందిన వందల ఎకరాల భూములను లీడర్ల ముసుగులో పలువురు ఇష్టారీతిన ఆక్రమించి, ప్లాట్లు పెట్టి అమ్ముకున్నారు. ఏళ్లు గడిచిన కొద్దీ వాటిలో బిల్డింగులు, అపార్ట్మెంట్ లు, కాలేజీలు వెలిశాయి. తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నా ఇన్నాళ్లూ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. సాక్ష్యాధారాలతో కంప్లైంట్స్వచ్చినా ఎండోమెంట్ ఆఫీసర్లు సీరియస్ గా తీసుకోలేదు. ఓ విధంగా అక్రమార్కులకు వారే సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలని కొందరు పూర్తి ఆధారాలతో లోకాయుక్త ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిజిటల్ సర్వే చేసి ఆలయ భూములకు బౌండరీలు ఫిక్స్ చేయాలని కోర్టు ఆదేశించింది. రెండు రోజులుగా ఎండోమెంట్, రెవెన్యూ ఆఫీసర్లు డిజిటల్ సర్వే చేస్తున్నారు. ఫలితంగా తమ కబ్జా బాగోతాలు ఎక్కడ బయటపడుతాయోనని, తమ దగ్గర ల్యాండ్స్ కొన్న వ్యక్తులు ఎక్కడ తిరగబడతారోననే భయంతో కొందరు లీడర్లు సర్వే సక్రమంగా జరగకుండా తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు.
78.30 ఎకరాల సంగతే తెలియదట!
హన్మకొండ నడిబొడ్డున దేవాదాయశాఖకు వందల కోట్ల విలువ చేసే భూములున్నాయి. అధికారుల లెక్కల ప్రకారమే పద్మాక్షి ఆలయానికి 898 సర్వే నంబర్లో 78.30 ఎకరాలు, మరో ఎనిమిది సర్వేనంబర్లలో72.23 ఎకరాలు, సిద్దేశ్వర టెంపుల్‍కు 882, 889, 922 సర్వే నంబర్లో 24.03 ఎకరాలు, వీర పిచ్చమాంబ దేవాలయానికి సర్వే నంబర్ 879లో 1.14 ఎకరాలు ఉన్నాయి. కీలకమైన 898 సర్వే నంబర్లో తమకు 78.30 ఎకరాల భూములు ఉన్న విషయాన్ని దేవాదాయశాఖ పూర్తిగా విస్మరించింది. రెవెన్యూ ఆఫీసర్లు చెప్పేవరకు అసలు తమకు ఆ సర్వే నంబర్లో భూములున్న విషయమే తెలియదని ఎండోమెంట్ఆఫీసర్లు అంటున్నారు. ఆఫీసర్లు ఇలా మొద్దు నిద్రలో ఉండడంతో లీడర్లు ఆ భూములను యథేచ్ఛగా కబ్జా చేశారు. కొందరు ప్లాట్లు చేసి అమ్ముకుంటే ఇంకొందరు అపార్ట్మెంట్లు కట్టి విక్రయించారు. పెద్దసంఖ్యలో బిల్డింగులు, కాలేజీలు కూడా వెలిశాయి. గ్రేటర్ మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడుతూ నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులిచ్చారు. రూల్స్‌కు విరుద్ధంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తూ సహకరించారు. ఒకప్పుడు సద్దుల పండుగొచ్చిందంటే ట్రైసిటీలోని సుమారు లక్షమంది మహిళలు పద్మాక్షి టెంపుల్మైదానంలో బతుకమ్మ ఆడిపాడేవారు. ఇప్పుడు జాగలన్నీ పోయి రోడ్డు మీద వందల మంది కూడా ఆడడం లేదు.
హైకోర్టు ఆదేశాలతో కదలిక..
పద్మాక్షి టెంపుల్, వీరపిచ్చమాంబ, సిద్దేశ్వరస్వామి, వరంగల్ వేణుగోపాలస్వామి ఆలయ భూములు కబ్జాలకు గురవుతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఫిర్యాదులు వచ్చినా ఏ రోజూ పట్టించుకోలేదు. దీంతో ‘కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ’, ‘వినియోగదారుల మండలి’ ఆధ్వర్యంలో లోకాయుక్త ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సర్వే చేసి వాస్తవాలు తేల్చాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆరు నెలల కిందే హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా, పెద్దస్థాయిలో ఉన్న అక్రమార్కులు సర్వేను ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసి ఈసారి హైకోర్ట్ సీరియస్ అయింది. మూడు, నాలుగు రోజుల్లో ఈ ఆలయాల భూములను డిజిటల్ సర్వే చేసి రిపోర్ట్ అందించాలని తాజాగా ఆదేశించింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు రంగంలోకి దిగారు. సర్వేలో కుడా(కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ), మున్సిపల్ సిబ్బంది సైతం పాల్గొనాలనే ఆదేశాలు ఉన్నా.. మొదటిరోజు రెండు డిపార్టుమెంట్ల నుంచి ఎవరూ రాలేదు. రెండో రోజు జీడబ్ల్యూఎంసీ నుంచి ఒకరు వచ్చినా.. కుడా నుంచి ఎవరూ జాడలేరు. సర్వే కంప్లీటై దేవాదాయశాఖ ఆస్తులకు హద్దులు పెట్టేవరకు.. ఈ భూముల్లో ఎలాంటి డెవలప్‍మెంట్ పనులు చేయొద్దని హైకోర్ట్ ఆదేశించినా యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు, ఇతరత్రా పనులు జరుగుతున్నాయి.
సర్వే చేయకుండా కుట్ర
హన్మకొండ పద్మాక్షి, సిద్దేశ్వర, వీర పిచ్చ మాంబ, వరంగల్ వేణు గోపాలస్వామి ఆలయాలకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో వందల ఎకరాల భూములు ఉన్నాయి. కాగా, గ్రేటర్ మున్సిపాలిటీ అధికారులు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతూ అపార్ట్మెంట్లు, బిల్డింగులు, కాలేజీల నిర్మాణాలకు అనుమతినిచ్చారు. ఎండోమెంట్ శాఖకు ఈ విషయం తెలిసినా ఏనాడూ పట్టించుకోలేదు. మేము ఆధారాల తో సహా ఫిర్యాదు చేసి సర్వే చేయమని చెప్పినా వినలేదు సరికదా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న లీడర్లు కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి ఇక్కడ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు.
- సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు
ఫిర్యాదు చేసినా పట్టించుకోలే
హన్మకొండలోని పద్మాక్షి గుడి, వీర పిచ్చమాంబ, సిద్దేశ్వర ఆలయాలకు సిటీలో వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక్కో ఎకరం విలువ రూ.2 కోట్ల పైమాటే. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు దేవాదాయ శాఖకు చెందిన భూములను కబ్జా చేస్తున్నారని ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలోని ఎండోమెంట్ కు చెందిన 78 ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నా ఆ శాఖ అధికారులు కనీసం స్పందించలేదు. దీంతో లోకాయుక్త ద్వారా హైకోర్టును ఆశ్రయించాం. ప్రస్తుతం డిజిటల్ సర్వే ద్వారా నిజనిజాలు బయటికి వస్తున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. - చీకటి రాజు, కాకతీయ వారసత్వ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు