![పోలీసుల పహారా మధ్య సర్వే](https://static.v6velugu.com/uploads/2025/02/the-land-survey-for-the-narayanpet-kodangal-lift-irrigation-scheme-was-conducted-under-police-guard_Z2TER198PS.jpg)
- కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల భూసేకరణకు అడ్డంకులు
ఊట్కూర్, వెలుగు : నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతుల పథకం భూ సర్వేను పోలీస్ పహారా మధ్య నిర్వహించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ తహసీల్దార్ చింత రవి, ఎస్సై కృష్ణంరాజు, మక్తల్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య ప్రభుత్వ భూమిలో సర్వే ను చేపట్టారు. ఊట్కూర్ మండలం బాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ పొలాల మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు భూముల కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాపూర్, తిప్రాస్ పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు పెట్టి సర్వే చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తాము ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకం కాదని, ఎక్కడి వరకు ప్రాజెక్టు పనులు చేపడతారో తెలియజేసి, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందిస్తామని భరోసా కల్పించాలని వేడుకున్నారు. లిఫ్ట్‌లో తమ భూములను త్యాగం చేశాక, తమకు సాగునీరు అందకుండా అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని తీసుకెళ్తే తమ పొలాలు ఎండి నష్టపోతామని పేర్కొన్నారు. తమను ఎక్కడికక్కడే కట్టడి చేసి భూసర్వే చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. సర్వే చేసే ప్రాంతాన్ని నారాయణపేట డీఎస్పీ లింగయ్య పర్యవేక్షించారు.