భారత రాజ్యాంగం దేశంలోని గిరిజనులను రెండు షెడ్యూల్స్‌లోకి గుర్తించింది. నార్త్ ఈస్ట్రన్లోని గిరిజనులను 6వ షెడ్యూల్ కింద, మిగతాప్రాంతంలోని గిరిజనులను 5వ షెడ్యూల్ కిందకు తెచ్చింది. మన రాష్ట్రంలో ఖమ్మం , ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో గిరిజనులను 5వ షెడ్యూల్ ప్రాంతాల కింద గుర్తించారు. అటవీ ప్రాంతంలో గిరిజనుల హక్కులకు ఆటంకం కలిగిస్తున్నారు అయిదో షెడ్యూల్లోని షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి ప్రత్యేక చట్టాలు వర్తిస్తున్నాయి. ఈ ఏరియాలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు ప్రవేశించాలన్నా, పనులు చేయాలన్నా, చివరకు అక్కడ నివసించాలన్నా ఈ చట్టాలకు లోబడాల్సిందే. వీటిని ప్రశ్నించాల్సన ప్రతిపక్షాలు రాజకీయ లాభాలకోసం పైపై మాటలకే పరిమితమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్‌కు లోబడి 1970లో 1/70 యాక్ట్ తేవడం జరిగింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలోని భూములు గిరిజనులకే చెందుతాయి. ప్రభుత్వం కూడా గిరిజనుల ప్రయోజనాలకు తప్ప మరే విధంగానూ అక్కడి భూమిని ఉపయోగించడానికి వీలు లేదు ప్రభుత్వ సంస్థలకు భూమిని అప్పగించడానికికూడా ప్రభుత్వానికి హక్కు లేదు ఈ హక్కు గిరిజనులకు రాజ్యాంగం ఇచ్చిన వరం.
కేంద్ర ప్రభుత్వం 74వ అమెండ్మెంట్ద్వారా’ పీసా ‘పంచాయితీరాజ్ ఎక్స్ టెన్షన్ షెడ్యూల్ ఏరియా చట్టాన్ని తీసుకొచ్చింది .మొత్తం 5. 6 షెడ్యూళ్లలోని గిరిజన ప్రాంతాలన్నింటికీ ఈ చట్టాన్ని వర్తింపజేశారు .ఈ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా గ్రామసభ అనుమతి తప్పనిసరి. గిరిజన అభివృద్ధిని పూర్తిగా ప్రభుత్వాల మీద వదిలేయకుండా ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిలర్లు బాధ్యత తీసుకుంటాయి. అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాతనే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ రూల్స్‌ని కూడా పాటించడం లేదు.
గతంలో విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రాంతంలోని బాక్సైట్ గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది ఈ సందర్భంలో ‘సుమలత’ అనే ఎన్జీవో గిరిజనుల తరపున సుప్రీం కోర్టులో కేసు చేయగా… మైనింగ్‌ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్నికూడా గిరిజనేతర సంస్థగానే పరిగణించింది. ఏజెన్సీలో తవ్వకాలు చేపట్టినట్లయితే గనులను గిరిజన వ్యక్తికి, గిరిజన ఏజెన్సీకి మాత్రమే అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2006 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం గిరిజనుల భూములను, రీసోర్స్ని అనుభవించడానికి గిరిజనేతరులకు హక్కు లేదు.
కానీ, నేడు పాలకులు చేస్తున్నదేమిటి? నల్లమల్ల అటవీ ప్రాంతంలో వజ్రాల తవ్వకాన్ని డీబీర్స్ కంపెనీకి అప్పగించారు. రాజీవ్ గాంధీ పులులు అభయారణ్యం పేరుతో 236, 237 జీవోలు విడుదల చేసి, చెంచులను నిర్వాసితులను చేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఓపెన్ కాస్ట్ పేరుతో ట్రైబల్స్ జీవనాధారాన్ని బొంద పెడుతున్నారు కుంతల హైడ్రో పవర్ స్టేషన్ పేరుతో చారిత్రక సాంస్కృతిక ఆధారాలను దెబ్బతీస్తున్నారు. గిరిజనులు అడవిలో ఉన్నంతకాలం ఏమి చేయలేం గనుక వారిని అడవి నుంచి దూరం చేయాలనుకుంటున్నారు.
–గుగులోతు శంకర్ నాయక్,
తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం,
రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు