గరిబోళ్ల భూములు బడాబాబుల చేతికి

ఆసిఫాబాద్,వెలుగు: ఏజెన్సీలోని పేదల భూములు బడాబాబుల చేతిలోకి వెళ్తున్నాయి. ఆదివాసీ గిరిజనుల అమయాకత్వాన్ని ఆసరా చేసుకున్న కొందరు వ్యాపారులు నయానో బయానో ఇచ్చి వారి భుములు కొనుగోలు చేస్తున్నారు. వెంచర్లుగా మార్చి అమ్మేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఆసిఫాబాద్, కెరిమెరి, జైనూర్ మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. అయినా ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడంలేదు.

చట్టానికి తూట్లు...

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు, అమ్మకాలు చట్టవిరుద్ధం. అయితే ఆదివాసీ గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కొందరు రియల్​వ్యాపారులు తక్కువ ధర ఇచ్చి భూములను మరో గిరిజనుడితో కొనుగోలు చేయిస్తున్నారు. బాండ్​పేపర్​రాయించుకొని ఎకరాలకు ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. ఆఫీసర్లకు ఎంతోకొంత ముట్టజెప్పి ఆబ్జెక్షన్ ​లేకుండా చూసుకుంటున్నారు. జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్ మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. జైనూర్ లో ఒక్కో ప్లాటుకు రూ. 20 లక్షలకు అమ్ముతున్నారంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది.

విస్తరిస్తున్న మాఫియా...

ఆసిఫాబాద్, జైనూర్ మండలాల్లో భూ దందా ఊపందుకుంది. రాజకీయలీడర్ల అండదండలు ఉండడంతో వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపణలున్నాయి. కొందరు వ్యాపారులు ఆదివాసీల పట్టాభూములు బలవంతంగా కబ్జాచేసి అమ్మేస్తున్నారు. నిలదీస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని దబాయిస్తున్నారు. జైనూర్​కాలేజీగూడ వైపు సర్వే నంబర్ 7/5 లో  ఆత్రం రవీందర్​కు చెందిన మూడు ఎకరాల పట్టాభూమి ఆక్రమణకు గురైంది. అక్కడ ఇండ్ల నిర్మాణం కూడా పూర్తిచేశారు. పట్టాభూమి కబ్జాకు గురైందని రవీందర్ అప్పటి ఐటీడీఏ పీవో ఆర్వి కర్ణణ్​కు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదు. జైనూర్ తహసీల్దార్ ఆఫీసు సమీపంలో జంగుపటేల్​కు చెందిన ఎకరం భూమి కబ్జాకు గురైంది. ఆయనా న్యాయం చేయాలని ఆఫీసర్లను ఆశ్రయించారు. 

న్యాయం చేయాలె

మూడు ఎకరాల పట్టా భూమి కబ్జాకు గురైంది. అప్పటి ఐటీడీఏ పీవో ఆర్వి కర్ణన్ కు దరఖాస్తు చేశాను. న్యాయం చేయాలని వేడుకున్న.  స్పందించిన పీవో 128 మందికి నోటీలు ఇచ్చినట్లు తెలిసింది. నాకు న్యాయం చేయాలి. నా భూమి నాకు దక్కేలా చూడాలి.

- ఆత్రం రవీందర్, జైనూర్

చట్టానికి తూట్లు పొడుస్తున్నారు..

ఏజెన్సీ భూములు కాపాడాలి. లేకపోతే ఆదివాసీలు అడవిలో బతకాల్సి వస్తుంది. ఆఫీసర్లు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి.

- ఆత్రం దేవుజీ, కటోడా ఆదివాసీ నాయకుడు