తెలంగాణలో వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి, వ్యక్తిగతంగా దూషించుకోవడానికి అభ్యంతరకరమైన భాష వాడుతున్నారు. ఈ మాటలు విని తెలంగాణ జనమే కాదు. దేశ ప్రజలంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. నేతల దిగజారుడు భాష పట్ల అందరూ విస్తు పోతున్నారు. ఆంధ్రా పెత్తందారులపై ఎంత కోపమొచ్చినా.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి దిగజారుడు మాటలు వాడలేదు. ఉద్యమ పథం సహా విమర్శ, ప్రతివిమర్శలూ హుందాగా సాగాయి. దిగజారుడు భాషతో నేతలు వ్యక్తిగతంగా విలువ కోల్పోవడంతో పాటు వారికి ఓటు వేసి గెలిపించిన ప్రజల ప్రతిష్ట కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
తెలంగాణ ఉద్యమం రెండు దశల్లో కొన్ని సంవత్సరాల పాటు సాగింది. వందలాది మంది స్టూడెంట్స్ఆత్మ బలి దానాలు చేసుకున్నారు. అనేక మంది తమ ఉద్యోగాలను వదులుకొని రోడ్డెక్కారు. మిలియన్ మార్చ్, రైలు రోకో, సకల జనుల సమ్మె ఇలా ఉద్యమం క్రమంగా ఉధృతంగా మారింది. పోలీసు కేసులు, లాఠీచార్జీలు, గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు ఎన్ని జరిగినా ఉద్యమంలో నాయకులు ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. ఆంధ్రపాలకులు తెలంగాణకు అన్యాయం చేసినా.. పెద్దగా దిగజారు భాష మాట్లాడలేదు. హుందాగానే విమర్శించారు. అందుకే తెలంగాణ ఉద్యమం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రం ఏర్పాటైతే పేరు ఎవరికి వస్తుందనే భేషజాలకు ఏ నాయకుడూ పోలేదు. స్వరాష్ట్ర సాధన ఉద్యమం కేవలం ఒకరి వల్ల జరిగింది కాదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు తమ శక్తి మేరకు హుందాగా ప్రవర్తించిన తీరు కారణంగా పార్లమెంటులో సైతం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు, తెలంగాణ నాయకులకు గౌరవం ఇస్తూ మద్దతుగా నిలిచాయి. కానీ హుందాగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాయకులు మాట్లాడుతున్న భాష తీరు అభ్యంతరకరంగా ఉంటోంది.
సన్నాసి.. దరిద్రుడా..
ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో నాయకులు ఏం చేస్తున్నారు, ఎటువైపు అడుగులు వేస్తున్నారు అనే విషయాన్ని దేశమంతా గమనిస్తూనే ఉంది. ఏది పడితే అది మాట్లాడటం దాన్నే తెలంగాణ భాష, సంస్కృతిగా అభివర్ణించడం నేటి రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. బాధ్యత గల పదవుల్లో ఉన్న నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ద్వారా వారి వ్యక్తిగత విలువ తగ్గడంతోపాటు దేశంలో రాష్ట్ర ప్రతిష్ట కూడా దెబ్బతింటోంది. అందుకే రాజకీయ నాయకుల భాష, వ్యవహార తీరు భావితరాలకు ఆదర్శంగా, పార్టీలకతీతంగా గౌరవించుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకో, వార్తా పత్రికల్లో స్పేస్, మీడియా కవరేజ్ కోసమో దిగజారుడు మాటలు మాట్లాడటం ప్రమాదకరం. రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు పోటాపోటీగా వ్యక్తిగత విమర్శలతో దాడి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈ అసభ్య పదజాలం మరీ హద్దులు మీరుతోంది. పరిపాలనలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు కూడా ప్రతిపక్ష నేతలను సన్నానులు, దరిద్రులు అని పబ్లిక్ మీటింగ్ల్లోనే తిడుతున్నారు. అలాగే ఒక నాయకుడు ముఖ్యమంత్రిని పట్టుకొని సన్నాసి అంటాడు, ఇంకో నాయకుడు దరిద్రుడా అంటాడు, మరి కొంత మంది నాయకులు ఉపఎన్నిక సీటు మాకు అంత ముఖ్యం కాదు కుక్కను నిలబెట్టి గెలుస్తాం అంటారు. మా సారు చెప్పును నిలబెట్టినా గెలిపిస్తాం అని హద్దు మీరి అసభ్య పదజాలాన్ని వాడుతున్నారు.
ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యల వల్ల మన నేతల గౌరవ మర్యాదలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. సోషల్ మీడియాలోనూ కొందరు నాయకులను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. వారు ఆవేదనతోనే మాట్లాడుతున్నప్పటికీ అసభ్య పదజాలం కాకుండా నిర్మాణాత్మక ధోరణిలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి. ప్రజలు కూడా అలాంటి విమర్శ, ప్రతి విమర్శలనే స్వాగతిస్తారు.
పీవీది ఆదర్శ నిర్ణయం
పది రోజుల క్రితం ఇద్దరు నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ.. తీవ్ర స్థాయి వ్యక్తిగత దూషణలకు దిగారు. పీసీసీ లీడర్ జోకర్అని అధికార పార్టీ నాయకుడిని ఎగతాళి చేస్తే.. దానికి బ్రోకర్ అంటూ కీలకమైన ఓ మంత్రి అసభ్య పదజాలంతో తిట్టడం మొదలుపెట్టడమే కాదు.. ఏకంగా తొడలు కొట్టి మరీ తిట్ల పురాణం చదివిన తీరు తెలంగాణ సమాజాన్ని నివ్వెరపర్చింది. వీళ్లకా మేం ఓటు వేసింది.. వీరినా పాలకులుగా గద్దెనెక్కించామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలి. పేపర్లో స్పేస్ కోసమో, న్యూస్ చానల్లో కవరేజ్ కోసమో సంస్కారం మరిచి మాట్లాడితే వారి వ్యక్తిగత పరువుతోపాటు వారిని ఎన్నుకున్న ప్రజల ప్రతిష్టకు నష్టం జరుగుతుంది. కాబట్టి నాయకులు ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకోవాలి.
రాజకీయాలు ఆదర్శంగా ఉండాలి
రాజకీయాలు యువతకు, విద్యార్థులకు, మేధావులకు రాబోవు తరాలకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలే కానీ వాటి వైపే చూడకుండా చేయొద్దు. పాలక -ప్రతిపక్షాల సంబంధాలని పునర్నిర్వచించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. తమిళనాడు సీఎం స్టాలిన్అవలంబిస్తున్న తీరు అందరి మన్ననలు పొందుతోంది. కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన కమిటీలో ప్రతి పక్ష నాయకులకు చోటు ఇవ్వడం, ప్రతిపక్ష నేతలు, గత ప్రభుత్వ పెద్దల ఫొటోలతో ప్రింట్అయిన స్కూల్బ్యాగులను యథాతథంగా పిల్లలకు పంచి కోట్ల రూపాయల ప్రజాధనం కాపాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చర్యలు స్టాలిన్ వ్యక్తిగత ప్రతిష్ట పెరగడంతోపాటు తమిళనాడు రాష్ట్ర ప్రజల గౌరవాన్ని పెంచాయి. గతంలో దేశంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. దేశ ప్రయోజనాల విషయంలో మా అందరిదీ ఒకే మాట అని ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి మన తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడు వాజ్ పేయిని పంపారు. అలాంటి విలువలతో కూడిన రాజకీయాల కోసం తెలంగాణ సమాజం
ఎదురుచూస్తోంది.
రాంనేని శ్రీకాంత్, సామాజిక కార్యకర్త