చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దటూరులో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్‘ఎక్స్పీరియం’ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారు. పార్క్రూపకర్త, చైర్మన్ రాందేవ్ రావు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘‘మాది వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం. మా తండ్రి ప్రకృతి ప్రేమికుడు. ఆయన స్ఫూర్తితోనే ఎక్స్ పీరియం బొటానికల్ గార్డెను ఏర్పాటు చేశాను. కలప వ్యాపారి అయిన మా నాన్న 30 ఎకరాల్లో చెట్లతో అడవిని పెంచాడు.
ఆయన స్ఫూర్తితో ఫైన్ ఆర్ట్స్ చేసి, అతిపెద్ద పార్క్‌ను సృష్టించాను. ఇది నా 20 ఏండ్ల కల. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, పప్యా మ్యాగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి 85 దేశాలు తిరిగి అరుదైన 25 వేల మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, శిలలను సేకరించి గార్డెన్ చేశాను. కేవలం మొక్కలు, చెట్లకే రూ.150 కోట్లు ఖర్చు చేశాను.
ఒక్కో శిల్పానికి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేశాను. సహజ శిలలకే రూ.15 కోట్లు ఖర్చు పెట్టాను. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద ఆంఫీ థియేటర్ పెట్టాం. 20 స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేశాం. రూ.50 కోట్లతో 12 ఎకరాల్లో మ్యాన్ మేడ్ బీచ్ ఏర్పాటు చేశాం.’’ అని తెలిపారు.