తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం.. ఫిబ్రవరి 26న ద్వారపూడిలో ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం..  ఫిబ్రవరి 26న ద్వారపూడిలో  ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఏర్పాటయ్యింది. 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిర్మించారు. మహాశివరాత్రి రోజున (ఫిబ్రవరి 26) ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. 

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఈసా యోగా కేంద్రంలో ఉన్న ఆదియోగి విగ్రహ నమూనా ఆధారంగా అచ్చం అలాంటి విగ్రహాన్నే ద్వారపూడిలో ఏర్పాటు చేశారు. కోయంబత్తూరులో ఉన్న విగ్రహం  112 అడుగుల ఎత్తు, 82 అడుగుల వెడల్పులో ఉంటుంది.  అదే నమూనాను బిక్కవోలు మండలం కొమరిపాలెం కు చెందిన శిల్పి పెద్ద రాఘవ బృందం పదినెలలు పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని  రూపొందించారు.  సుమారు రూ.20 లక్షల వ్యయంతో పూర్తిగా సిమెంట్ తో ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు ఆలయ గురుస్వామి ఎస్‌ఎల్ కనకరాజు తెలిపారు.

ఇప్పటికే ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అరుదైన శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు పదుల సంఖ్యలో ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు ఈ ఆదియోగి విగ్రహం ద్వారా ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మండపేట మండలానికి చెందిన ఈ ద్వారపూడి..  రాజమహేంద్రవరం నుంచి 20 కిలోమీటర్లు, అనపర్తికి నుంచి  రెండు కిలోమీటర్ల దూరంలో సామర్లకోట కెనాల్ రోడ్ ను ఆనుకుని ఈ ఆలయం ఉంటుంది.