నాడు ఎగ్గొట్టి.. నేడు గగ్గోలు : బీఆర్ఎస్ తీరుపై విద్యుత్ శాఖ వర్గాల్లో విస్మయం

నాడు ఎగ్గొట్టి.. నేడు గగ్గోలు : బీఆర్ఎస్ తీరుపై విద్యుత్ శాఖ వర్గాల్లో విస్మయం
  •  డిస్కమ్​లకు రూ.25 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ లో పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 
  • రూ.12,550 కోట్ల ట్రూఅప్​చార్జీలు, రూ.2,378 కోట్ల ఎఫ్ఏసీలు చెల్లిస్తామని హామీ 
  • చివరకు అవి ఎగ్గొట్టి.. కరెంట్ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.5,596 కోట్ల భారం 
  • అప్పుల భారం నుంచి బయటపడేందుకు చార్జీల పెంపు కోసం తాజాగా డిస్కమ్ ల ప్రతిపాదన 
  • ఇప్పుడు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మాజీ మంత్రుల గగ్గోలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్​పంపిణీ సంస్థల(డిస్కమ్​లు)కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగవేసిన బాకీలు.. తాజాగా కాంగ్రెస్​సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కరెంటు సరఫరా కోసం పెట్టిన పెట్టుబడులకు, వచ్చిన ఆదాయానికి మధ్య ఏటా రూ.5వేల కోట్లకు పైగా లోటును డిస్కమ్​లు ఎదుర్కొన్నాయి. దీంతో  పదేండ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.60వేల కోట్లకు పైగా నష్టాల పాలయ్యాయి. వాటిని నష్టాల నుంచి బయట పడేయాల్సిన అప్పటి బీఆర్ఎస్​సర్కార్.. ఆ పని చేయకుండా తన వంతుగా వేల కోట్ల బకాయిలు పెట్టి డిస్కమ్ ల పుట్టి ముంచింది.

ట్రూఅప్​చార్జీలు, ఎఫ్ఏసీలు చెల్లిస్తామని హామీలు ఇచ్చి.. చివరకు వాటిని ఎగ్గొట్టింది. దీంతో డిస్కమ్ లు ట్రాన్స్​ఫార్మర్లు, కరెంట్​పోళ్లు, సబ్​స్టేషన్లు.. ఇలా అన్నింటినీ కుదువపెట్టి అడ్డగోలు అప్పులు చేశాయి. ఇప్పుడు వాటి నుంచి బయటపడేందుకు చార్జీల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. ఆ ప్రపోజల్స్​కు కాంగ్రెస్​సర్కార్ ఇంకా ఆమోదముద్ర వేయకముందే.. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్​రెడ్డి చార్జీల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలంటూ విద్యుత్​నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి  ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

10 వేల కోట్ల కరెంట్ బిల్లులూ చెల్లించలేదు.. 

2016–17 నుంచి 2022–23 వరకు వాస్తవిక చార్జీలకు (ట్రూఅప్​ చార్జీలు) సంబంధించిన రూ.12,550 కోట్లను విద్యుత్​ వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అప్పట్లో ఈఆర్సీ ఆమోదం తెలిపింది. కానీ డిస్కమ్​లకు తామే ఈ డబ్బు చెల్లిస్తామని, వినియోగదారులపై భారం మోపబోమని అప్పటి సీఎం కేసీఆర్​ప్రకటించారు. ఈఆర్సీ బహిరంగ విచారణ  సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఈ మేరకు ప్రకటన చేయించారు. కానీ ఒక్క పైసా విడుదల చేయలేదు. అంతే కాదు ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఏసీ) రూపంలో రావాల్సిన రూ.2,378 కోట్లు ఇవ్వకుండా పెండింగ్​పెట్టారు. 

ఇవి చాలదన్నట్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రభుత్వ స్కూళ్లు, గవర్నమెంట్​ఆఫీసులకు సంబంధించి రూ.10వేల కోట్లకుపైగా కరెంట్ బిల్లులు కూడా  చెల్లించలేదు. దీంతో డిస్కమ్​లకు సర్కార్ బకాయిలే రూ.18,550 కోట్లకు పైగా పేరుకుపోయాయి. దీంతో గత సర్కార్ పెండింగ్ పెట్టిన బకాయిలను ఇవ్వాలని ఈఆర్సీకి ఇచ్చిన యాగ్రిగేట్​రెవెన్యూ రిక్వైర్​మెంట్​(ఏఆర్ఆర్​) ప్రతిపాదనల్లో డిస్కమ్​లు తాజాగా విన్నవించాయి. 2016-–17 నుంచి 2022-–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,550 కోట్ల ట్రూఅప్​చార్జీలు, రూ.2,378 కోట్ల ఎఫ్ఏసీలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర బకాయిలను ఏఆర్ఆర్​ప్రతిపాదనల్లో చేర్చాయి. 

తమ తప్పులను కాంగ్రెస్​పైకి నెట్టే యత్నం.. 

డిస్కమ్​లు చార్జీల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలంటూ ఈఆర్సీకి మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్​రెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో వీరి హయాంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం మేర కరెంటు చార్జీలు పెంచి, ప్రజలపై రూ.5,596 కోట్ల భారం మోపిన విషయాన్ని విద్యుత్​శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.  డొమెస్టిక్‌‌ కేటగిరీకి 50 పైసలు, ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పున భారం మోపడమే కాక.. కస్టమర్‌‌ చార్జీలు కూడా భారీగా పెంచారని చెబుతున్నారు. 

50 యూనిట్లలోపు వాడే  పేదలపైనా కరుణ చూపలేదని, యూనిట్‌‌కు రూ.1.45 నుంచి రూ.1.95 వరకు పెంచి 40 లక్షల మంది పేదలపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ భారం మోపిందని వివరిస్తున్నారు. 51–100 యూనిట్లలోపు వినియోగానికి యూనిట్ చార్జీలను రూ.2.60 నుంచి రూ.3.10కి, 101–200 యూనిట్ల వినియోగానికి రూ.4.30 నుంచి రూ.4.80కు పెంచారని.. అలాగే కమర్షియల్‌‌, ఇండస్ట్రియల్‌‌కు యూనిట్​కు రూ.1 పెంచారని గుర్తు చేస్తున్నారు. ఇలా బాకీలు చెల్లించకుండా చార్జీలు పెంచినవాళ్లే.. ఇప్పుడు కేవలం ప్రతిపాదనల దశలోనే కాంగ్రెస్ సర్కార్ మీద గగ్గోలు పెడ్తున్న తీరుపై విద్యుత్​శాఖ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.