
ఇండియాలో హై క్యాడర్ ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్–ఏ వంటి మొత్తం 24 రకాల సర్వీసుల్లో నియామకాల కోసం పరీక్షను నిర్వహిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పాలసీ మేకర్స్‌గా మారి, ప్రజా సేవ చేయాలనే ఆసక్తి ఉన్న యువతకు ఇది మంచి అవకాశం, ఉన్నతమైన హోదాతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు సివిల్ సర్వీసెస్ ప్రత్యేకత. ఈ ఏడాది యూపీఎస్సీ నోటి ఫికేషన్ వివరాలతో పాటు అర్హతలు, ఎగ్జామ్ పాటర్న్ ప్రిపరేషన్ ప్లాన్ ఈ వారం స్పెషల్…
సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీలో మార్కుల శాతం కనీసం ఇంత ఉండాలని ఎటువంటి నిబంధనేమీ లేదు. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ప్రిలిమినరీలో నెగ్గితే తమ డిగ్రీ సర్టిఫికెట్‌ను మెయిన్స్‌కు దరఖాస్తు చేసేటపుడు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిఫెన్స్ లో పనిచేసిన వారికి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు అటెంప్ట్స్ పై పరిమితి లేదు. మొత్తం సివిల్స్ ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉంటుంది.
వయసు: 2020 ఆగస్టు1 నాటికి అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు, బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు.
పరీక్షా విధానం
మూడు దశల్లో ఉండే సివిల్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్ పరీక్ష అయిన ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్–1 (200 మార్కులు), సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) (200 మార్కులు). ఈ రెండో పేపర్ అర్హత పరీక్ష. అంటే దీనిలో 67 మార్కులు (33 శాతం) తెచ్చుకుంటేనే పేపర్–1ను మూల్యాంకనం చేస్తారు. పేపర్–1లో ప్రతిభ చూపిన 10,500 మంది తర్వాతి అంచె అయిన మెయిన్స్ రాయటానికి అర్హులౌతారు.
ప్రిలిమినరీ పరీక్ష
ఇందులో రెండు పేపర్లుంటాయి. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీ–శాట్). ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్–1లో 100 ప్రశ్నలు, పేపర్–2లో 80ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్షకు కాలవ్యవధి రెండు గంటలు(120 నిమిషాలు). ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని పోస్టుల సంఖ్య, రిజర్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. అయితే ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను చివరి ఎంపికలో పరిగణించరు. సీశాట్ కేవలం అర్హత పరీక్ష. ఇందులో 33 శాతం అంటే 67 మార్కులు సాధిస్తేనే జనరల్ స్టడీస్ పేపర్ ఎవాల్యూషన్ చేస్తారు. పేపర్–1 జనరల్ స్టడీస్ లో ప్రతిభ చూపిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
మెయిన్స్
ఇందులో మొత్తం 9 పేపర్లుంటాయి. మొదటి విభాగంలో 300 మార్కుల చొప్పున పేపర్–ఎ (ఇండియన్ లాంగ్వేజ్), పేపర్–బి(ఇంగ్లిష్) అనే రెండు పేపర్లు ఉంటాయి. ఇవి కేవలం అర్హత పేపర్లు మాత్రమే. ప్రతి పేపర్లో కనీసం 75 మార్కులు సాధించాలి. అన్ని పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో మొత్తం ఏడు పేపర్లుంటాయి. జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్(జీఎస్) పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ఇంటర్వ్యూ జాబితా రూపకల్పనకు ఇందులో పొందే మార్కులే కీలకం. ప్రతి పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులు ఉంటాయి. అభ్యర్థి పూర్తి స్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో పరీక్షలు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్ లేదా ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో రాసే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ
మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. మెయిన్స్, ఇంటర్వ్యూకు కలిపి మొత్తం మార్కులు 2025. ఈ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
కరెంట్ ఎఫైర్స్‌పై దృష్టి పెట్టాలి
వర్తమాన అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. ఏదో తెలిసిన సమాచారంతో రాస్తే సమాధానంలో స్పష్టత ఉండదు. అందుకే కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రత్యేక దృష్టి అవసరం. వాటిని జనరల్ స్టడీస్‌తో ముడిపెడుతూ చదివితే ప్రిపరేషన్ చాలా సులువు అవుతుంది.
ఉమ్మడి ప్రిపరేషన్
సివిల్స్ పరీక్షకు యూపీఎస్సీ నుండి ప్రకటన వెలువడిన నాటి నుంచి కూడా మెయిన్స్ కోణంలోనే ప్రిపరేషన్ కొనసాగించాలి. చాలా మంది అభ్యర్థులు ముందు ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతారు. ఆ తర్వాత మెయిన్స్ సంగతి చూద్దాంలే అనే ధోరణిలో ఉంటారు. కానీ ఇది సరైన ప్రిపరేషన్ విధానం కాదు. ముందు నుంచీ ప్రిలిమ్స్‌తో పాటే మెయిన్స్‌కు కూడా సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌లోని సీశాట్‌ను ప్రత్యేకంగా చదువుకోవాలి. గణితం మీద పట్టులేని అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు సీశాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి.
ఆప్షనల్ సబ్జెక్ట్స్ కీలకం
ఆప్షనల్స్లోని రెండు పేపర్లకు చాలా లోతైన ప్రిపరేషన్ అవసరం. అభ్యర్థులు సిద్ధం చేసుకున్న సొంత మెటీరియల్‌ను ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఇందులో ఏ ఒక్క చాప్టర్‌ను కూడా విస్మరించకూడదు. సిలబస్‌లో ఉన్న ప్రతి చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆప్షనల్ సబ్జెక్టు ఏదైనప్పటికీ పీజీ స్థాయిలో ప్రిపరేషన్ ఉంటేనే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
పరీక్ష రాసే విధానం
మారిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో వివిధ అంశాలపై సమగ్ర అవగాహన ప్రాధాన్యం ఎంతో ఉంది. చాలా మంది అభ్యర్థులకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉన్నా ఇంగ్లిష్ రాకపోవడం వల్ల మార్కులు సాధించలేకపోతున్నారు. ఇంగ్లిష్ రావడానికి ప్రతి రోజూ ఇంగ్లిష్ దినపత్రికలను చదవడంతో పాటు లోక్‌సభ, రాజ్యసభ, ఎన్డీటీవీ వంటి వార్తా చానెళ్లను రోజూ కొద్ది సేపైనా చూడాలి. వీటిల్లో మంచి ఉచ్ఛారణతో కూడిన ఇంగ్లిష్‌ను వినొచ్చు. అంతే కాకుండా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రిపరేషన్ కోణంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది.
తెలుగులో రాసినా సక్సెస్
‘ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాదు. రాయడం అంతంత మాత్రమే.. కానీ సివిల్స్ సాధించాలని కోరిక. సక్సెస్ సాధించడం ఎలా? ’ అని చాలా మందికి భయం ఉంటుంది. అయితే ఇది అపోహ మాత్రమే. ఇప్పటి వరకు యూపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో తెలుగు స్టూడెంట్స్ హాజరు శాతం చాలా తక్కువ. ఇందుకు ఇంగ్లిష్ రాదనే కారణమే అధికం. సివిల్స్ జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి అవసరమైన మేరకు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ అవసరమే. కానీ సివిల్స్ సాధించడం తెలుగు మీడియం స్టూడెంట్స్ కు సాధ్యం కాదనే భావనను తీసేయ్యాలి. 2016లో తెలుగులో పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంగి గోపాలకృష్ణ ఎందరికో స్పూర్తి. ఇలా చాలా మంది తెలుగులో రాసి విజయం సాధించిన వాళ్లు ఉన్నారు. మంచి గైడెన్స్‌తో ముందుకు వెళ్తే విజయం తథ్యం. ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్లన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. ప్రిలిమ్స్ మల్టీపుల్ చాయిస్‌లో ఉంటుంది. కావున వాటిని అర్థం చేసుకుని కరెక్ట్ ఆప్షన్ ఎన్నుకుంటే సమస్య ఉండదు. అయితే మెయిన్స్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని డిస్క్రిప్టివ్‌లో రాయాల్సి ఉంటుంది. తెలుగులో రాసే అవకాశమున్నా.. ఇంగ్లీష్‌లో ఇచ్చిన ప్రశ్నలను అర్థం చేసుకునేంత సామర్థ్యం ఉండాలి. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు మొదటి నుంచి ఇంగ్లీష్ పేపర్లు, పుస్తకాలు చదివితే కొంత పదజాలం సంపాదించవచ్చు. ఉన్నతమైన లక్ష్యం, పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు.
నోటిఫికేషన్
పోస్టులు: సివిల్స్–796, ఐఎఫ్ఎస్–90
అర్హత: సివిల్స్ కు ఏదైనా డిగ్రీ. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు సైన్స్ సబ్జెక్టులైన అగ్రికల్చర్/ ఫారెస్ట్రీ/ యానిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ జియోలజీ/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ జువాలజీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్ / ఫారెస్ట్రీ / ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పాసయిన వారు అర్హులు.
వయసు: 2020 ఆగస్టు 1 నాటికి జనరల్ అభ్యర్థులు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిఫెన్స్ లో పనిచేసిన వారికి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ద్వారా
ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఫీజు మినహాయింపు ఉంది.
అటెంప్ట్స్: జనరల్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా రాయొచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరితేది: 2020 మార్చి 3
ప్రిలిమ్స్ ఎగ్జామ్: 2020 మే 31
వెబ్‌సైట్: www.upsc.gov.in