కడవెండి.. కన్నీటి సంద్రం.. స్వగ్రామంలో ముగిసిన మావోయిస్ట్‌‌ రేణుక అంత్యక్రియలు

కడవెండి.. కన్నీటి సంద్రం.. స్వగ్రామంలో ముగిసిన మావోయిస్ట్‌‌ రేణుక అంత్యక్రియలు
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజాసంఘాల లీడర్లు, మాజీ మావోయిస్ట్‌‌లు, గ్రామస్తులు 
  •  కళాకారుల ఆటపాటలతో మారుమోగిన గ్రామం, మూడు గంటల పాటు అంతిమయాత్ర
  • రేణుక కుటుంబ సభ్యులను పరామర్శించిన పలువురు లీడర్లు

జనగామ, వెలుగు: ఉద్యమాల పురిటిగడ్డ కడవెండి గ్రామం కన్నీటి సంద్రంగా మారింది. గ్రామమంతా ఎర్రజెండాలతో నిండిపోగా.. కామ్రేడ్‌‌ రేణుకక్క అమర్‌‌ రహే.. జోహార్‌‌ రేణుకక్క అన్న నినాదాలు, కళాకారుల ఆటపాటలతో మారుమోగింది. చత్తీస్‌‌గఢ్‌‌లోని దంతెవాడలో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన మావోయిస్ట్‌‌ గుమ్మడవెల్లి రేణుక అలియాస్‌‌ భాను అలియాస్‌ మిడ్కో అంత్యక్రియలు బుధవారం స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. 

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చేరుకున్న రేణుక డెడ్‌‌బాడీని కడసారి చూసేందుకు, నివాళి అర్పించేందుకు గ్రామస్తులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజాసంఘాల లీడర్లు, సానుభూతిపరులు, మాజీ మావోయిస్టులు, గ్రామస్తులు వేల సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.

ఆటపాటలతో అంతిమయాత్ర
మావోయిస్ట్‌‌ రేణుక అంతిమయాత్రను మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభమైంది. ఎర్రజెండాలతో అలంకరించిన ట్రాక్టర్‌‌లో డెడ్‌‌బాడీని ఉంచి యాత్ర ప్రారంభించారు. అరుణోదయ కళాకారుల డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆటపాటలు, విప్లవజోహార్ల నడుమ సుమారు మూడు గంటల పాటు యాత్ర కొనసాగింది. గ్రామంలోని దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం నుంచి మొదలైన యాత్ర దివంత మావోయిస్ట్‌‌లు ఎర్రంరెడ్డి సంతోష్‌‌రెడ్డి, పైండ్ల వెంకటరమణారెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక స్థూపాల మీదుగా సాగి గ్రామ శివారులోని వాగు వద్దకు చేరుకుంది. అక్కడ రేణుక తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మ, సోదరులు జీవీకే.ప్రసాద్‌‌, రాజశేఖర్‌‌తో పాటు బంధువులు చివరిసారిగా నివాళి అర్పించి దహనసంస్కారాలు పూర్తి చేశారు.

రేణుక అంతిమయాత్రలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు బి. అంజమ్మ, పద్మకుమారి, ఉమ్మడి వరంగల్‌‌ అధ్యక్షురాలు శాంతక్క, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి రివేరా, సీనియర్‌‌ కార్యవర్గ సభ్యుడు పాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాత్రి సుధాకర్, రాము, సుదర్శన్, బాలసాని రాజయ్య, నాగేశ్వర్, విరసం ఉమ్మడి వరంగల్ కన్వీనర్ కోడం కుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్‌‌.వేణుగోపాల్‌‌, చిన్నయ్య, పౌరహక్కుల సంఘం లీడర్‌‌ ప్రొఫెసర్‌‌ లక్ష్మణ్‌‌, నారాయణరావు, ప్రొఫెసర్‌‌ కాత్యాయనీ విద్మహే, లంక పాపిరెడ్డి, జిట్టా బాల్‌‌రెడ్డి, రమేశ్‌‌, నరసింహారెడ్డి, బీఎన్‌‌.శర్మ, గాదె ఇన్నయ్య, భారతక్క, సంధ్యక్క తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది పోలీసుల మఫ్టీలో అంతిమయాత్రలో పాల్గొని మాజీల కదలికలపై కన్నేశారు.

రేణుక కుటుంబానికి లీడర్ల పరామర్శ
మావోయిస్ట్‌‌ రేణుక మృతదేహం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సోదరుడు జీవీకే ప్రసాద్‌‌, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీడిత ప్రజల కోసం సుమారు 30 ఏండ్లు పోరాడిన రేణుక ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోవడం బాధాకరం అన్నారు. అనంతరం ఆపరేషన్‌‌ కగార్‌‌పై బీఆర్‌‌ఎస్‌‌ వైఖరేంటో చెప్పాలని అక్కడే ఉన్న ప్రజాసంఘాల లీడర్లు డిమాండ్‌‌ చేశారు. దీంతో ఆపరేషన్‌‌ కగార్‌‌ను తాము వ్యతిరేకిస్తున్నామని పల్లా, ఎర్రబెల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.