కొన్ని పాత సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది! టీవీల్లోనూ, ఆన్‌లైన్, ఓటీటీల్లోనూ వాటికుండే క్రేజే వేరు. పాత తరం, కొత్త తరం అని తేడా లేకుండా ఆ సినిమాలను రిపీటెడ్‌గా చూస్తుంటారు. సినిమాలే కాదు.. కొన్ని టీవీ షోలకూ ఇటువంటి క్రేజ్ ఉంది. ఇలాంటి వాటన్నింటిలోనూ వ్యూస్ వల్లనో, టీఆర్పీ వల్లనో, బ్రేక్‌లో వేసే యాడ్స్ వల్లనో వచ్చే ఆదాయం తప్ప కొత్తగా సొమ్ము చేసుకోవడం వీలుకాదు. యూకేలోని మిరైడ్ అనే కంపెనీ చేసిన ఒక వెరైటీ ఆలోచన ఆ పాత సినిమాలు, షోలకు సంబంధించిన ఓనర్లు, రైట్స్ కొనుక్కొన్న వారికి మరింత డబ్బు సంపాదించుకునే టెక్నాలజీకి జీవం పోసింది.
కొత్త వస్తువులతో బ్రాండింగ్
బాగా పాపులర్ అయిన పాత సినిమాలు, షోల్లో అప్పటి పాత కాలపు వస్తువులు ఉంటాయి. వాటిలో చాలా వస్తువులు నేటి ప్రపంచంలో ఎవరూ వాడడంలేదు. కొన్ని రకాల బ్రాండ్స్, వస్తువులు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే అలనాటి వస్తువులు చూడడానికి, నాటి లైఫ్ స్టైల్‌ను ఇప్పటి తరం తెలుసుకోవడానికి ఉపయోగపడే మార్గం ఆ సినిమాలే. అయితే వాటి ఒరిజినల్ అట్లనే ఉంచుతూ ఆ సినిమాలు, షోలలో హీరోలు, ఆర్టిస్టులు వాడిన వస్తువులు, బ్యాగ్రౌండ్‌లో కనిపించే యాడ్స్ లాంటివన్నీ ప్రస్తుతం వాడే వాటితో నింపేస్తే మంచి ఆదాయం వస్తుందన్న ఆలోచన యూకే టెక్ కంపెనీ మిరైడ్ చేసింది. ఏఐ టెక్నాలజీ సాయంతో డెవలప్ చేసిన ఓ టూల్ ద్వారా వాటిని సినిమా సీన్‌లో ఎటువంటి డిస్ట్రబెన్స్ లేకుండా మార్చేయొచ్చని ఆ కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీని హాలీవుడ్ క్లాసిక్స్ అయిన ది గ్రేట్ ఎస్కేప్ లాంటి సినిమాలపై ఇప్పటికే ప్రయోగించినట్లు తెలిపింది. ఆ సినిమాల్లో వాడిన వస్తువుల స్థానంలో ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్‌గా వచ్చిన కొత్త వస్తువులను పెట్టినట్లు చెప్పింది.
ప్రొడక్షన్ కంపెనీలు, ఓటీటీలకూ ఆదాయం
ఒరిజినల్ కంటెంట్ అందించిన సినిమా, షో ప్రొడక్షన్ సంస్థలతో పాటు ఇప్పుడు వాటిని టెలికాస్ట్ చేసే వారికి కూడా కొత్త వస్తువుల బ్రాండింగ్ ద్వారా మరింత ఆదాయం వస్తుందని యూకే టెక్ కంపెనీ చెబుతోంది. ఆయా సినిమాల్లో ఉన్న వస్తువులను బట్టి ప్రస్తుతం ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకోవచ్చనేది చూసి వచ్చే రెవెన్యూ షేర్ చేసుకోవచ్చంటున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలు కూడా యూజర్స్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్న బ్రాండ్స్ ఆధారంగా సినిమా సీన్‌లో బ్యాగ్రౌండ్‌లో ఉండే యాడ్స్ మార్చేలా ఈ టెక్నాలజీ ఉంటుందని ఆ కంపెనీ చెబుతోంది. ఫేస్‌బుక్, గూగుల్ సెర్చ్ లాంటి వాటి ఆధారంగా ఒక్కో కస్టమర్‌కు ఒక్కో రకమైన యాడ్స్ చూపించేలా మార్చొచ్చని తెలిపింది. దీంతో ఈ ఓటీటీ కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని పేర్కొంది. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో సంప్రదింపులు పూర్తయ్యాయని, కొద్ది నెలల్లోనే పది సినిమాల వరకూ ఈ యాడ్ రీప్లేస్‌మెంట్ టెక్నాలజీతో ప్రపంచం ముందుకు తీసుకురాబోతున్నట్టు మిరైడ్ తెలిపింది.