- ఫలితాలపై నేతల్లో ఉత్కంఠ
- ఎగ్జిట్ పోల్స్ పై మొదలైన విశ్లేషణలు
- ఓటింగ్ సరళిపై కేసీఆర్ ఆరా
- ప్రగతిభవన్ లో కేటీఆర్, హరీశ్ భేటీ
- గెలుపు ధీమాలో కాంగ్రెస్
- రేవంత్ రెడ్డి ఇంటికి అభ్యర్థులు
- హంగ్ పై కమలనాథుల ఆశలు
- 15–20 స్థానాలు వస్తాయన్న లీడర్లు
హైదరాబాద్ : ఎల్లుండి వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నిన్న సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై విశ్లేషణలు మొదలయ్యాయి. ఫాంహౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ ఓటింగ్ సరళిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సెగ్మెంట్లకు చెందిన అభ్యర్థులు, నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రజలు విసుగు చెందారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ఢిల్లీలో ధీమా వ్యక్తం చేశారు.
మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కాసేపటి క్రితం ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. ఓటింగ్ సరళి.. ఫలితాలపై సెగ్మెంట్ల వారీగా విశ్లేషణ చేస్తున్నారు. తాము మూడో సారి అధికారంలోకి రాబోతున్నామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమా గులాబీ లీడర్లలో కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ ఆధారంగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయని, ఆ తర్వాత జరిగిన ఓటింగ్ ను పరిగణనలోకి తీసుకోలేదని అందువల్ల వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. మూడో సారి కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హంగ్ పై బీజేపీ ఆశలు
రాష్ట్రంలో హంగ్ ఏర్పడబోతోందని బీజేపీ భావిస్తోంది. తామే కీలకంగా మారుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 15–20 స్థానాల్లో పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అదే జరిగితే తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని అలా జరిగితే రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. అదే జరిగితే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది.
రేవంత్ ఇంటికి అభ్యర్థులు
సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ నేతలు హుషారు మీద ఉన్నారు. ఇవాళ ఉదయం పలువురు అభ్యర్థులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. ఇవాళ ఉదయం జహీరాబాద్ అభ్యర్థి చంద్రశేఖర్, కూకట్ పల్లి అభ్యర్థి బండి రమేష్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు.