యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్‌లో గ్రూప్ గొడవలు సద్దు మణగలేదు. ఖమ్మంలో జరిగిన జన గర్జన సభకు లీడర్లు ఎవరికి వారీగా తరలివెళ్లారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న లీడర్లు, ఆలేరు నియోజకవర్గంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బీర్ల అయిలయ్య వేర్వేరు గ్రూపులుగా సభకు వెళ్లారు. పార్టీ ప్రోగ్రామ్స్ కూడా ఎవరికి వారుగా చేస్తున్న ఈ నేతల గ్రూప్ రాజకీయాలు చాలాసార్లు బహిర్గతమయ్యాయి. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పాదయాత్ర యాదాద్రి జిల్లాలో ఎంటర్ అయిన సమయంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బీర్ల అయిలయ్య, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన మరో లీడర్ కల్లూరి రాంచంద్రారెడ్డి, బీర్ల అయిలయ్య మధ్య కూడా గొడవ జరిగింది.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదల నగేశ్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, బీర్ల అయిలయ్య మధ్య గొడవల జరిగిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్ నేషనల్ లీడర్ రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు, తెలంగాణ దశాబ్ది దగా కార్యక్రమాలను గ్రూపుల వారీగా నిర్వహించడం పార్టీలోచర్చనీయాంశంగా మారింది. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా భువనగిరి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు మీటింగ్ఏర్పాటు చేసుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న లీడర్లతో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి సంబంధిచిన వారు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. దీన్ని జన గర్జన మీటింగ్‌లోనూ కొనసాగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.