మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులు గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికార పార్టీ లీడర్లు ప్రచారం చేస్తుండగా, ఇతర పార్టీల లీడర్లు టీఆర్‌ఎస్ వైఫల్యాలు, అమలుచేయని హామీల గురించి చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే...
సంస్థాన్‌నారాయణపురం, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు బీజేపీలో చేరుతారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పాడు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక పార్టీ నుంచి గెలిచి కాంట్రాక్టులు, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్యాండిడేట్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి పాల్గొన్నారు.
రాజగోపాల్‌రెడ్డిని తరిమికొట్టాలి
చండూరు, వెలుగు : స్వార్థం, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామాల్లో తిరగనివ్వొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తోకల చంద్రకళ, కోడి వెంకన్న, భూతరాజు దశరథ్ ఉన్నారు.
హరీశ్‌రావుది తప్పుడు ప్రచారం
సంస్థాన్ నారాయణపురం, వెలుగు : దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో రూ.3వేల పెన్షన్ ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, మంత్రి హరీశ్‌రావు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గౌడ ఆత్మీయ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, భూడిద భిక్షమయ్య గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతు కేసీఆర్ విచ్చలవిడిగా మద్యం, బెల్ట్ షాపులను పెంచి గీత కార్మికుల పొట్టకొట్టాడన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక, హుజురాబాద్ లో గెలిస్తే బీజేపీ రూ.3వేలు ఇస్తానని ఎక్కడా చెప్పలేదని, మంత్రి మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పైగా బీజేపీ గెలిస్తే పెన్షన్లు రావని, మోటార్లకు మీటర్లు పెడతారని భయపెట్టారన్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పింఛన్లు ఎంత ఇస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, అక్కడి నేపథ్యాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఉంటాయన్నారు. దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలుపు ఖాయం
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవడం ఖాయమని ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం, కోయిలగూడెం, చింతలగూడెం, దామర, పంతంగి గ్రామాల్లో ఆదివారం ఇంటింటి
ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టే దక్కించుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్లు వెళ్లిపోయారు గానీ క్యాడర్ కాదన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు.
బీజేపీ విజయానికి కృషి చేయాలి
చౌటుప్పల్, వెలుగు : మునుగోడులో బీజేపీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని లింగోజిగూడెంలో ఆదివారం జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, బూత్ ఇన్‌చార్జి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ ఆయన మాట్లాడారు. లీడర్లు ప్రతిరోజు ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంటుందని ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కర్నాటి ధనుంజయ, దాసోజు భిక్షమాచారి, కౌన్సిలర్ బండమీది మల్లేశం, పిల్ల బుచ్చయ్య, జక్కడి ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.