- భద్రాద్రి జిల్లా కరకగూడెం అడవుల్లో ఈ నెల 5న ఎన్‌కౌంటర్
- నిజనిర్ధారణకు బయలుదేరిన పౌరహక్కుల సంఘం నేతలు
- మణుగూరులో అరెస్ట్ చేసి అశ్వాపురం తరలించిన పోలీసులు
- కరకగూడెం ఎన్‌కౌంటర్ బూటకం అన్న లీడర్లు
అశ్వాపురం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో ఈ నెల 5న జరిగిన ఎన్‌కౌంటర్ నిజనిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం నేతలను మణుగూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, డాక్టర్ ఎన్.నారాయణ రావుతో పాటు 14 మంది లీడర్లు శనివారం బస్సులో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు మణుగూరులోని పీవీ కాలనీ క్రాస్ రోడ్డు వద్ద బస్సును అడ్డుకొని నేతలను మణుగూరు పోలీస్‌స్టేషన్ తీసుకె ళ్లి, అక్కడి నుంచి అశ్వాపురం తరలించారు.
పౌర హక్కుల సంఘం నేతల అరెస్ట్‌ను మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఖండించారు. ఏజెన్సీలో 15 ఏండ్ల తర్వాత పోలీసుల కాల్పులు మొదలయ్యాయని, పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అదుపులో ఉన్న లీడర్లను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యలను సీపీఎంఎల్ మాస్‌లైన్ డివిజన్ సెక్రటరీ ఆర్.మధుసూదన్‌రెడ్డి, సీపీఐ మండల సెక్రటరీ అనంతనేని సురేశ్, ప్రజా ఫ్రంట్ జిల్లా సహాయ కార్యదర్శి గౌను నాగేశ్వరరావు ఖండించారు.
కరకగూడెం ఎన్‌కౌంటర్ బూటకం
ఖమ్మం టౌన్, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఈ నెల 5న జరిగిన ఎన్‌కౌంటర్ బూటకం అని, అందుకే నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకుంటున్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, డాక్టర్ ఎన్.నారాయణరావు అన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్లేస్‌కు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతల్లో లక్ష్మణ్, నారాయణరావును విడుదల చేయడంతో వారు ఖమ్మం చేరుకున్నారు.
అక్రమ అరెస్ట్‌ను జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఉమ్మడి జిల్లా నేతలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వెళ్తున్న తమను మణుగూరు పోలీసులు అడ్డుకొని, రోడ్డుపైనే రెండు గంటల పాటు విచారణ జరిపిన అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు.
కేసీఆర్ అడుగుజాడల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడుతామని, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్.. ఎన్‌కౌంటర్‌పై వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు వెళ్తున్న తమను అరెస్ట్ చేయించడం సరికాదన్నారు. పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో అనారోగ్యంతో బాధపడే వారిని, నిద్రపోతున్న వారిని చంపేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అమిత్‌షా, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఎన్‌కౌంటర్లకు తెరలేపారన్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 180 మంది చనిపోగా, ఇందులో ఆదీవాసీలే ఎక్కువగా ఉన్నారన్నారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రవి, సహాయ కార్యదర్శులు కుమారస్వామి, తిరుమలయ్య, ఖమ్మం జిల్లా నాయకులు శిరీష, ఉదయ్, రాఘవేందర్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రాయల పావేల్, ఉపాధ్యక్షుడు పి.విప్లవ్‌కుమార్, ఎస్.వెంకటేశ్వర్లు, మాస్‌లైన్ పార్టీ నాయకులు ఆవుల అశోక్, తెలంగాణ పీపుల్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.విజయ్, చిర్రా రవి, పీడీఎస్‌యూ నాయకులు మస్తాన్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు జి.నరేందర్, పీవోడబ్ల్యూ నాయకులు ఝాన్సీ
పాల్గొన్నారు.