నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని మార్చాల్సిందే .. కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీ ముఖ్య నేతల హెచ్చరిక

మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకే టికెట్ వస్తుందని ఆశపడి భంగపడ్డ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్.. తన అనుచరులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆవుల రాజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కోవర్టు అని, ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేసి.. నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​చేశారు.

నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్, అంజనేయులు, రవిందర్ మీడియా సమావేశం నిర్వహించారు. మూడో లిస్టులో అయినా నర్సాపూర్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్​చేశారు. లేకపోతే తమ ముగ్గురిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా నర్సాపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తామని చెప్పారు.