తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ తలమునకలైంది. ఆలస్యం చేయకుండా త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు రావాలని అధిష్టానం కబురు పంపింది. ఇంతకు ముందు తాజ్ కృష్ణా హోటల్ లో రూమ్స్ బుక్ చేశారు. కానీ.. ఇప్పుడు లొకేషన్ మార్చారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు రావాలని ఆదేశించారు. గెలిచిన నాయకులు దూరప్రాంతాల నుంచి రావడానికి ఐదారు గంటలు సమయం పట్టె అవకాశం ఉంది. అయితే.. ఆదివారం (డిసెంబర్ 3) రాత్రి 10 గంటల తర్వాతనే ఏఐసీసీ నేతలు సమావేశంకానున్నారు.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోపాటు ఏఐసీసీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇదే సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎం అభ్యర్థిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం (డిసెంబర్ 4న) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.