న్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి

న్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి

పార్లమెంట్​ న్యాయ సేవాధికారత సంస్థల చట్టాన్ని1978లో తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా యోగ్యత గల న్యాయసేవలు అందరికీ ఒకే విధంగా అందుబాటులోకి వచ్చే వెసులుబాటు కలిగింది. ఈ చట్టాన్ని 1987లోనే పార్లమెంట్​అమోదించినా, అది అమల్లోకి వచ్చింది మాత్రం 1995 నవంబర్​9న. అందుకే ఆ తేదీని దేశవ్యాప్తంగా న్యాయ సేవల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ చట్టం ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు, బలహీన వర్గాల ప్రజలకు యోగ్యత గల న్యాయ సేవలు లభించే అవకాశం ఏర్పడింది. ఆర్థిక, ఇతర వైకల్యాలు ఉన్న వ్యక్తులకు న్యాయ సేవలు అందించే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఈ వైకల్యాల వల్ల న్యాయం పొందే విషయంలో వారికి ఇబ్బందులు ఉండకూడదనేది చట్టం ఉద్దేశం. లోక్​అదాలత్​లను ఏర్పాటు చేసి సత్వరంగా న్యాయ పరిష్కారం అందే విధంగా చూడటం కూడా ఈ శాసన ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా? లేదా అన్నది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు వెతికే ముందు ఈ చట్టం రూపు దిద్దుకోవడానికి దారి తీసిన విషయాలను తెలుసుకోవడం అవసరం. 

సత్వర న్యాయం అందేలా..

న్యాయ సేవల అమలు కోసం విస్తృతంగా అధ్యయనం చేసి సరైన సిఫారసులు చేయాలని 1976లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​భగవతి అధ్యక్షతన జ్యుడికేర్​కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​వీఆర్ క్రిష్ణయ్యర్​సభ్యులు. ఈ కమిటీ భారత న్యాయసేవల బిల్లు1977ను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్1977లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో 39ఏను రాజ్యాంగంలో చేర్చింది. ఈ ఆర్టికల్​ ప్రకారం.. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. న్యాయ సహాయం అందరికీ అందుబాటులోకి రావాలి. ఆర్థిక దుస్థితి వల్ల గానీ, లేక మరే ఇతర కారణాల వల్ల గానీ న్యాయాన్ని పొందే అవకాశం కొందరికి లేకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. ఈ పరిస్థితిని నివారించేందుకు అలాంటి వ్యక్తులకు న్యాయ సహాయాన్ని అందించడానికి తగిన శాసనాలను, ఇతర పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. ఆ తర్వాత భారత ప్రభుత్వం లీగల్​ఎయిడ్​స్కీములను అమలు చేయడం కోసం సీఐఎల్​ఏఎస్(సిలాస్)​అనే కమిటీని1980 ఆగస్టు 26న ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులకు న్యాయ సహాయం అందేవిధంగా చర్యలను పర్యవేక్షించడానికి ఈ ‘సిలాస్’ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమల్లోకి వచ్చింది. 

సేవాధికార సంస్థల ఏర్పాటు

దేశవ్యాప్తంగా న్యాయ సేవల అమలు చూడటానికి జాతీయ సేవాధికార సంస్థ, రాష్ట్రాలకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లాలకు సంబంధించి జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, తాలూకాల్లో తాలుకా న్యాయ సేవాధికార సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలు న్యాయ సహాయంతో పాటు, లోక్​అదాలత్​లను నిర్వహించి సత్వరంగా కేసులను పరిష్కారం చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం అందజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చట్టం ద్వారా లోక్​అదాలత్​లకు చట్టపరమైన హోదా కల్పించారు. లోక్​అదాలత్​లు జారీ చేసే అవార్డులకు, కోర్టు జారీ చేసే డిక్రీలకు ఉండే అధికారం కల్పించారు. సివిల్​కోర్టు, క్రిమినల్​కోర్టు తీర్పుల మాదిరిగా ఈ అవార్డులు ఉంటాయి. ఉభయ పక్షాల అంగీకారంతో లోక్​అదాలత్​ల అవార్డులపై అప్పీలు ఉండదు. అందుకని లిటిగెంట్లకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఏర్పడుతుంది. మోసం, న్యాయపరమైన లోపాలు ఉన్నప్పుడే హైకోర్టులకు వెళ్లడానికి అవకాశం ఉంది. న్యాయ విజ్ఞాన సదస్సులు, న్యాయ సహాయం లోక్​ అదాలత్​లు ఏర్పాటు చేయడం ఈ చట్ట ఉద్దేశం. న్యాయ విజ్ఞాన సదస్సుల పేరుతో విపరీతమైన డబ్బు ఖర్చు చేస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.  సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు కూడా సదస్సులకు హాజరు కావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం మీద విపరీతమైన భారం పడుతున్నది. ఈ సదస్సుల కోసం, అదే విధంగా లోక్​అదాలత్​ల నిర్వహణకు వచ్చినప్పుడు ప్రచార ఆర్భాటాల వల్ల ఈ చట్టం ఉద్దేశమే దెబ్బతినే  ప్రమాదం ఏర్పడుతున్నది. ఈ మధ్య రాజకీయ నాయకులను ఆహ్వానించినట్టుగా న్యాయమూర్తులను ఆహ్వానిస్తూ అక్కడక్కడ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. ఈ ప్రచార ఆర్భాటాలు అవసరమా? లోక్​అదాలత్​ల ప్రచారం అవసరమే కానీ న్యాయమూర్తుల ప్రచారం అవసరమా? అనేది న్యాయమూర్తులు 
ఆలోచించాల్సిన అంశం.

కేసుల సంఖ్య పెరిగేందుకు చూడొద్దు..

‘సమావేశానికి వస్తున్న న్యాయమూర్తులను రకరకాల సంప్రదాయ వేషాల్లో ఉన్న వ్యక్తులను ఎదుర్కోవడం లాంటి సంఘటనలను గమనించినప్పుడు ఆనందం కన్నా ఆందోళన కలుగుతున్నది’ ఈ విషయం నేను అంటున్నది కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన న్యాయమూర్తి అన్న మాటలు ఇవి. ఈ సమావేశాల వల్ల జిల్లా న్యాయమూర్తుల మీద విపరీతమైన భారం పడుతున్నది. కోర్టు పని కూడా కుంటుపడుతున్నదని చాలా మంది సీనియర్​ న్యాయవాదులు తరచూ అంటున్న మాట. లోక్​అదాలత్​ల్లో కేసుల సంఖ్య పెరగడం కోసం పోలీసులు ఉప సంహరించుకున్న కేసులను, నేరాన్ని ఒప్పుకున్న కేసులను చాలా మంది న్యాయమూర్తులు చూపిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ విధంగా కేసుల పరిష్కారం చేసిన సంఖ్యను పెంచడం అవసరమా? పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి రాజీ చేయడం సరికాదు. అలాగే ముద్దాయి లేకుండా రాజీ చేయడం మంచిది కాదు. రాజీ అంటే ఇరుపక్షాల మధ్య అంగీకారం. పార్టీలను ఒప్పించి, సామరస్యంగా పరిష్కారం చేసినప్పుడు కలిగే ఆనందం ఈ కేసుల సంఖ్యను పెంచడం వల్ల ఉండదు. ఈ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ఇవి ఆలోచించాల్సిన అంశాలు. 

=మంగారి రాజేందర్,రిటైర్డ్ జిల్లా జడ్జి