- ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు
- ప్రజాప్రతినిధులు, ఐఏఎస్,ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు
- గతంలో మాదిరి రాళ్లురప్పలు,చెట్టుపుట్టలు, రోడ్లకు ఇవ్వొద్దు
- కేవలం సాగు భూములకేఇవ్వాలని సూచనలు
- సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. గతంలో మాదిరి దుబారా జరగకుండా, పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని సూచించింది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందులో పలు కీలక సిఫార్సులు చేసినట్టు తెలిసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది. ‘‘రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణ చేపట్టాం. ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సాయం అక్కర్లేదని, పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు ఏడు, ఏడున్నర ఎకరాల వరకు లిమిట్ పెట్టాలన్నారు. కొంతమంది 10 ఎకరాలు, ఇంకొంత మంది 5 ఎకరాల వరకే ఇవ్వాలన్నారు’’ అని తెలిపింది. రాష్ట్రంలోని భూకమతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులే 90 శాతానికి పైగా ఉన్నారని చెప్పింది. అలాగే ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు), ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకూ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది.
Also Read : చలి పంజా.. గజగజలాడుతున్న ఉత్తర తెలంగాణ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 ఇవ్వాల్సి ఉందని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు ఇచ్చారు. అది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు (పార్ట్బి మినహా) ఇచ్చారు. దీంతో ప్రతి సీజన్‌కు యావరేజ్‌గా రూ.7,600 కోట్లు ఖర్చయింది. మరోవైపు చెట్టుపుట్టలు, రాళ్లురప్పలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు జమ చేసింది. దీంతో వేల కోట్లు వృథా అయ్యాయి. ఇక మీదట ఆ పొరపాట్లు జరగకుండా పక్కాగా సాగు భూములకే రైతు భరోసా అందించాలి. టెక్నాలజీని వాడుకుని ఏ సర్వే నెంబర్ భూముల్లో ఏయే పంటలు వేశారో శాటి లైట్, డిజిటల్ సర్వేలతో గుర్తించి పెట్టుబడి సాయం అందించాలి” అని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది.
సీజన్ కు రూ.7,500 కోట్లు..
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారో ఏఈఓలు ఇప్పటికే ఆన్ లైన్ లో నమోదు చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే.. సీజన్ కు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా సీలింగ్పెట్టినా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్‌పేయర్స్ లాంటి వాళ్లను మినహాయించినా.. ఈ మొత్తం తగ్గుతుందని అంటున్నారు. నిబంధనలు పక్కాగా అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే రూ.7,500 కోట్లు సరిపోతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సాగు భూముల లిస్టులో నుంచి నాన్‌అగ్రికల్చర్ భూములను తీసేయనుంది. ఇలా కనీసం 15 లక్షల ఎకరాలు తీసేసే చాన్స్ఉన్నట్టు తెలిసింది. దీంతో దాదాపు రూ.1,300- కోట్ల నుంచి రూ.1,500 కోట్ల దుబారాను అడ్డుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగులో లేని రాళ్లురప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు ఇతరత్రా వాటికి రైతు బంధు కింద ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా చెల్లించినట్టు తెలుస్తున్నది.
అసెంబ్లీలో చర్చించి నిర్ణయం..
కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కమిటీ సూచనల మేరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి?అనే దానిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాతే రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేయనున్నట్టు తెలుస్తున్నది. కాగా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.