- టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు
- మహబూబ్‌నగర్‌లో తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు
- కొడుకు జనార్దన్ కోసం ఏఈ పేపర్ కొన్న తండ్రి మైబయ్య
- 6 లక్షలకు బేరం.. 2 లక్షల అడ్వాన్స్ చెల్లింపు
- ఇప్పటి వరకు 19 మంది అరెస్టు
హైదరాబాద్/మహబూబ్‌నగర్/గండీడ్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు లింకులు బయటపడుతున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఏఈ పేపర్ కొనుగోలు చేసిన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు తరలించి శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరి ద్వారా ఇంకెవరికైనా పేపర్ లీక్ అయ్యిందా? అనే వివరాలు రాబట్టేందుకు నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది.
మైబయ్యను కలిసిన ఢాక్యానాయక్..
ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్, తమ్ముడు రాజేశ్వర్‌ను సిట్ విచారించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఢాక్యానాయక్‌తో కలిసి పని చేసినోళ్ల వివరాలు సేకరించింది. టీఎస్ పీఎస్సీ డేటా ఆధారంగా గండీడ్, కొడంగల్ మండలాలు సహా వికారాబాద్ జిల్లాలో ఏఈ పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు సేకరించింది. ఢాక్యానాయక్ కాల్ డేటా ఆధారంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా పని చేస్తున్న మైబయ్య నంబర్ ట్రేస్ చేసింది.
మైబయ్య తన కొడుకు జనార్దన్ కోసం ఢాక్యానాయక్ వద్ద ఏఈ పేపర్ కొన్నట్లు గుర్తించింది. మైబయ్య గతంలో ఉమ్మడి రంగారెడ్డిలోని కుల్కచర్లలో టీఏగా పని చేశాడు. అక్కడే డ్యూటీ చేసిన ఢాక్యానాయక్‌తో పరిచయం ఏర్పడింది. మైబయ్య కొడుకు జనార్దన్ ఏఈ ఎగ్జామ్ రాస్తున్నాడని తెలిసి, మైబయ్యను ఢాక్యానాయక్ కలిశాడు. తన వద్ద ఏఈ పేపర్ ఉందని, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ.6 లక్షలకు డీల్ కుదరగా, మైబయ్య అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించాడు.
పాలమూరు నుంచే ఎక్కువ మంది..
ఈ ఇద్దరి అరెస్ట్‌తో పేపర్ల లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 20కి చేరింది. వీరిలో న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్ రెడ్డి మినహా 19 మందిని సిట్ అరెస్ట్ చేసింది. వీరిలో ఎక్కువ మంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులే ఉన్నారు. ఇప్పటి వరకు గండీడ్ మండలం పంచాగల్ తండాకు చెందిన రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్, ఇదే మండలంలోని మన్సూర్‌పల్లి తండాకు చెందిన రేణుక తమ్ముడు రాజేశ్వర్ నాయక్, నీలేశ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రాజేందర్ నాయక్, ఇదే మండలం సల్కార్పేటకు చెందిన తిరుపతయ్య, షాద్‌నగర్‌కు చెందిన రాజేందర్‌కుమార్, నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్, వికారాబాద్ జిల్లాలోని లగత్చర్లకు చెందిన గోపాల్‌నాయక్ అరెస్టు అయ్యారు. ఇప్పుడు మైబయ్య, జనార్దన్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
డీఆర్డీఏ చుట్టే వ్యవహారం..
పేపర్ల లీకేజీ వ్యవహారం డీఆర్డీఏ చుట్టూ తిరుగుతోంది. ఢాక్యానాయక్ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా పని చేస్తున్నాడు. మొదట గండీడ్‌లో డ్యూటీలో చేరగా తర్వాత ధారూర్‌లో, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పని చేస్తున్నాడు. గతంలో ఈయన పని చేసిన చోట ఇదే శాఖలోని టీఏలతో పరిచయం ఉంది. ఈ క్రమంలో పేపర్ లీకేజీ విషయాన్ని వారితో చర్చించినట్లు తెలిసింది. లక్షల్లో డీల్ కుదుర్చుకొని వారికి పేపర్ షేర్చేసినట్లు సమాచారం. ఈ కేసులో టీఏలుగా పనిచేసిన తిరుపతయ్య, ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్, మైబయ్య ఇప్పటికే అరెస్టు అయ్యారు.