
ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించింది. యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే రూ.889.7 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో స్థానికుల ఆకాంక్షలను నెరవేర్చగలదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉన్నత విద్య, పరిశోధనా సౌకర్యాలను సులభతరం చేయడంతో పాటు ప్రోత్సహిస్తుందన్నారు. గిరిజన విద్యపై దృష్టి పెట్టడమే కాకుండా.. సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఇతర సెంట్రల్ యూనివర్శిటీల మాదిరిగానే విద్య, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు.