ఓఆర్ఆర్​ నుంచి కింద పడ్డ లారీ.. డ్రైవర్ సజీవ దహనం

ఓఆర్ఆర్​ నుంచి కింద పడ్డ లారీ.. డ్రైవర్ సజీవ దహనం

మేడ్చల్, వెలుగు: ఓఆర్ఆర్ నుంచి జీహెచ్ఎంసీ చెత్త లారీ కిందపడడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం జిల్లా ఇల్లందుకు చెందిన పినబోయిన సందీప్ (25) మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో నివాసం ఉంటూ జీహెచ్ఎంసీ చెత్త లారీని నడుపుతున్నాడు. ఎప్పటిలాగే చెత్తను తెచ్చేందుకు బుధవారం మియాపూర్‎కు వెళ్లి, ఓఆర్ఆర్ మీదుగా జవహర్ నగర్ డంప్ యార్డుకు బయలుదేరారు. మార్గమధ్యలో మేడ్చల్ గౌడవెళ్లి సమీపంలో మధ్యలో ఉన్న కల్వర్ట్ అండర్ పాస్‎ను గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో లారీ పడిపోయింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. స్థానికులతో సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే మంటల్లో చిక్కుకొని సందీప్ సజీవ దహనమైనట్లు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.