మద్యం మీదున్న ప్రేమ మనుషుల మీదేది

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెంచుతోంది. కానీ దాని దుష్పరిణామాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత ఎనిమిదేండ్లలో పట్టణాల్లో బార్లు.. మండలాల్లో వైన్సులు.. పల్లెల్లో బెల్టుషాపులు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ఎక్కడపడితే అక్కడ దొరికే మద్యానికి అలవాటు పడే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం బానిసలు సమాజంలో హింస, అశాంతి, అకృత్యాలకు కారణమవుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన తెలంగాణలో.. సర్కారు ఎక్సైజ్​విధానం సరిగా లేక.. రాష్ట్రం మరింత వెనుకబడే ప్రమాదముంది. దీన్ని ఆపేందుకు యువకులు, మేధావులు, ఉద్యమకారులు పోరాటాలకు సిద్ధమవ్వాలి.

తెలంగాణలో గత ఎనిమిదేండ్లుగా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా  ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి. పాలన సరిగా సాగడం లేదని, అవినీతి పెరిగిందని, ప్రాణ, ధన, ఆస్తులకు రక్షణ ఉండటం లేదని మెజారిటీ ప్రజలు అసంతృప్తితో  ఉన్నారు. ఆర్థిక వనరులన్నీ విచ్చలవిడిగా అధికార వర్గాల ప్రయోజనాలకు, వృథాగా అనుత్పాదక ఖర్చులకే వెచ్చించడం ఆందోళన కలిగిస్తోంది. మన రాష్ట్రానికి ప్రణాళిక మండలి కూడా ఉంది, కానీ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక విధానం, వ్యవసాయ, విద్య,  వైద్యం, మానవాభివృద్ధి విధానం రూపొందించి అమలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయ లేదనేది అక్షర సత్యం. సామాజిక న్యాయం, సంక్షేమం, అణగారిన వర్గాల అభివృద్ధి మొదలైన విధానాలు రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలో లేకపోవడం ఉద్యమకారులను, ప్రజలను, మేధావులను దిగ్బ్రాంతికి, నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నది. మానవాభివృద్ధిలో విద్య , ఆరోగ్యం ఉపాధి, జీవన ప్రమాణాలు, సత్వర న్యాయం, స్త్రీ పురుష సమానత్వం కీలకమని, అవి సమాజ అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఈ విషయాలన్నీ మన పాలకులకు, అధికారులకు తెలియనివి కాదు.
 

మద్యం విస్తరణ మాత్రం పక్కాగా..
తెలంగాణలో ప్రజలు, మేధావులు ఆశించిన సామాజిక, ఆర్థిక అభివృద్ధి విధానాలు గొప్పగా లేకున్నా.. ఈ రాష్ట్రానికి రియల్ ఎస్టేట్ వ్యాపార విధానం, వైన్ షాపుల విస్తరణ, అమ్మకాల పెంపొందించే విధానాలు మాత్రం పక్కాగా అమలవుతున్నాయి. పాలకులు తమకు ఇష్టం అయినవి, చేయదలుచుకున్నవి మాత్రమే చేస్తున్నారు. వైన్ షాపుల సంఖ్య గత ఎనిమిదేండ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. 2014 లో 900 షాపుల ఉండగా అవి 2022 నాటికి 2700 అయ్యాయి. ఇక బెల్టు షాపుల సంఖ్య చెప్పనక్కర్లేదు. ప్రతి వీధికో బెల్ట్​షాపు, కిరాణంలో దొరకని మందు లేదన్నట్లుగా వ్యవస్థ తయారైంది. బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా బాగా పెరిగాయి. రాష్ట్ర రాజధానిలో 2014లో పబ్బుల సంఖ్య 6 ఉండగా.. 2022 నాటికి 90కి చేరాయి. మందు దుకాణాల వృద్ధి ఇలా ఉంటే.. ఇందుకు పూర్తి భిన్నంగా వేల సంఖ్యలో సర్కారు బడులు అభివృద్ధికి నోచుకోక మూత పడటానికి సిద్ధంగా ఉన్నాయి. 
 

ఆమ్దానీ పెంచుకునుడేనా?
మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వ ఆదాయం అనుకున్న లక్ష్యం కంటే వేగంగా పెరుగుతోంది. రాష్ట్రానికి ఎప్పుడు వనరుల కొరత ఏర్పడినా.. మద్యం ధరలు పెంచుకోవడం.. ద్వారా ఖజానా లోటును భర్తీ చేయడం సాధారణమైంది. ఏటా రెండు, మూడు సార్లు ధరలు పెంచినా.. మద్యం అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడటం లేదని గ్రహించిన విధాన కర్తలు.. దాన్ని ఒక అక్షయపాత్రగా, ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో మద్యం అమ్మకాల ద్వారా కేవలం రూ. 9 వేల కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత సంవత్సరాంతానికి అది 40 వేల కోట్ల రూపాయల వరకు  వస్తుందని అంచనా. గత ఎనిమిదేండ్లలో ఎక్సైజ్ ఆదాయం 400 శాతం పెరిగిందన్నమాట. ఎక్సైజ్​విధానం.. ప్రభుత్వ ఖజానాకు ఒక జీవనదిగా ఉపయోగపడుతున్నది. 
 

దుష్పరిణామాలు అనేకం..
గత ఎనిమిదేండ్లుగా విస్తరిస్తున్న వైన్ షాపులు, వాటి మద్యం విక్రయాల వల్ల సమాజంలో అనేక దుష్పరిణామాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అల్పాదాయ, బడుగు బలహీన వర్గాల ప్రజల, కార్మికుల ఆదాయాలపై, వారి ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తుపై శ్రామిక శక్తి సామర్థ్యాలపై అంతిమంగా సమాజాభివృద్ధిపై కూడా మద్యం అమ్మకాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రతి పట్టణం, ఊరు, పల్లె, తండా, వాడకు.. మద్యం బార్లు, వైన్ షాపులు, బెల్టు షాపుల ద్వారా వేగంగా విస్తరిస్తోంది. ఇది ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే గాకుండా.. కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. మద్యానికి అలవాటు పడిన అనేక మంది ఇంట్లో కనీస అవసరాలు తీర్చలేక, పిల్లల విద్య, వైద్య ఖర్చులకు డబ్బులు వెచ్చించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు పేదరికం నుంచి తీవ్ర పేదరికంలోకి వెళ్తున్నాయి. మద్యం వ్యసనం విద్యార్థుల నుంచి మొదలు.. వృద్ధుల వరకు పాకుతోంది. 
 

శ్రామిక శక్తి సామర్థ్యాలపై ఎఫెక్ట్
ఒక అధ్యయనం ప్రకారం తాగుడు వ్యసనం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మద్యానికి బానిసలై లక్షల మంది పురుషులు అకాల మరణం చెందడం వల్ల మహిళలు భర్తను కోల్పోయి, పిల్లల భారం మీద వేసుకొని జీవిత కాలపు సాంఘిక, ఆర్థిక సంక్షోభంలో జీవన పోరాటం చేస్తున్నారు. మద్యం వ్యసనం వల్ల తెలంగాణలోని కార్మిక శక్తి సామర్థ్యాలు సన్నగిల్లి, సామర్థ్యాలు తగ్గిపోయి రాష్ట్రంలో బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాల నుంచి వలస కార్మికుల అవసరం ఏర్పడుతున్నది. మద్యం విక్రయాల వల్ల తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. యువ శక్తిని సరిగా ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వం.. ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఫలితంగా యువకులు మద్యం అలవాటు చేసుకుంటున్నారు. బాలికలు, మహిళలపై దౌర్జన్యాలు పెరగడానికి గల కారణాల్లో మద్యం వ్యసనం ప్రధానమైనది. అందుకే రాష్ట్ర ఏర్పాటు తర్వాత బాలికలపై అత్యాచారాలు పెరుగుతూ వస్తున్నాయి.  సమాజం సాధించిన అభివృద్ధిని మద్యం విక్రయాలు తిరోగమన దిశలో 
పెడుతున్నాయి. మద్యానికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఇవ్వకుండా విద్య,  వైద్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీని వల్ల ఎక్కువ నష్టపోయేది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలే. ఉన్నత వర్గాలపై ఈ ప్రభావం పెద్దగా లేకపోయినా.. పేద కుటుంబాలు మరింత పేదరికంలోకి వెళ్తున్నాయి. 
 

ఉద్యమాలు రావాల్సిందేనా?
1992లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమాలకు ప్రభుత్వాలనే మార్చివేసిన చరిత్ర ఉంది. కొంపలు కూలుతున్నా, లక్షలాది మంది మద్యం బారిన పడి కాలం చేస్తున్నా, మాట్లాడే వారు లేకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు జరిగే సమాజ తిరోగమన విధానాలను నిలదీసే మేధావులు, మహిళా సంఘాలు, ప్రజలను చైతన్యం చేస్తూ మరో సారా వ్యతిరేక ఉద్యమాన్ని  తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తెచ్చుకుంటే అందరం బాగు పడతామని, అభివృద్ధి చెందుతామని ఆశిస్తే.. మద్యం రక్కసి జీవితాలను తలకిందులు చేస్తోంది. 
- ప్రొ. కూరపాటి వెంకటనారాయణసోషల్​ ఎనలిస్ట్