ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం సోమవారం (జులై 31న) ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం మధ్యలో కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 9.5 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు గాలులు బలంగా వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల మాత్రం భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు.. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.