- బెట్టింగ్ ముఠా అరెస్ట్
- పోలీసుల అదుపులో ఐదుగురు, పరారీలో మరో ముగ్గురు
- రూ. 8 లక్షలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం
మహబూబాబాద్, వెలుగు : క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను మహబూబాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్, టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం టౌన్ పీఎస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వంగినేని చిరంజీవి అలియాస్ బీకే, ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన పాశం శ్రీనివాస్, ఖమ్మంకు చెందిన గంజి చైతన్య ఐపీఎల్ బెట్టింగ్ బుకీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఏపీలోని గుంటూరు, విజయవాడ, తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో చైన్ లింక్ సిస్టం ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
మహబూబాబాద్‌కు చెందిన కాట సుధాకర్, శ్రీకాంత్ యాదవ్, బత్తిని ఉదయ్, మల్లం వంశీ కృష్ణ, ఎండి రిజ్వాన్‌లు ఐపీఎల్ మ్యాచ్ జరిగే టైంలో వంగినేని చిరంజీవికి ఫోన్ చేసి రేటింగ్ తెలుసుకొని బెట్టింగ్ పెట్టేవారు. దీనికి సంబంధించిన డబ్బులను ఖమ్మంకు చెందిన గంజి చైతన్య తీసుకొని పాశం శ్రీనివాస్‌కు పంపిస్తుండగా, అక్కడి నుంచి చిరంజీవికి అందేవి. బెట్టింగ్ విషయం తెలుసుకున్న పోలీసులు పాశం శ్రీనివాస్, గంజి చైతన్య, కాట సుధాకర్, మల్లం వంశీ, ఎండీ. రిజ్వాన్‌లను అరెస్ట్ చేయగా, వంగినేని చిరంజీవి, బత్తిని ఉదయ్, శ్రీకాంత్ యాదవ్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.8 లక్షలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకున్న మహబూబాబాద్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు బి.సంతోష్, సీహెచ్. రమేశ్‌కు రివార్డు అందజేయనున్నట్లు చెప్పారు.
చైన్ లింక్ ఛేజింగ్‌తో బెట్టింగ్‌కు చెక్
హనుమకొండ, వెలుగు : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వరంగల్ పోలీసులు స్పెషల్ ప్లాన్ తయారు చేశారు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టిం గ్ యాప్‌లపై ఫోకస్ పెట్టి గ్యాంగ్‌లను గుర్తిస్తున్నారు. యాప్‌లను వినియోగించే వారితో పాటు వారికి అనుబంధంగా బెట్టింగ్‌లు పెట్టే వారినీ గుర్తించే పనిలో పడ్డారు. మొదట బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి వారికి లింకప్‌గా ఉండే ముఠాల వివరాలను ఆరా తీసి ఆరెస్ట్ చేస్తున్నారు. ఇలా వరంగల్ నగరంలో ఇప్పటికే ఐదు గ్యాంగ్‌లను పట్టుకోగా.. ఒక బుకీ సహా 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారి గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్సాక్షన్లు, ఇతర ఆన్‌లైన్ పేమెంట్లను గుర్తించి మిగతా బుకీలు, పంటర్ల వివరాలు సేకరిస్తున్నారు.
హోటళ్లు, బార్లే అడ్డాగా...
ప్రతి ఐపీఎల్ సీజన్‌లో వరంగల్ బెట్టింగ్‌లకు అడ్డాగా మారుతోంది. నగర శివార్లలో కొన్ని హోటళ్లు, బార్లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌లు ప్లే చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు దర్జాగా వచ్చి ఆన్‌లైన్‌లో దందా మొదలుపెడుతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో యువకులు ఎక్కువగా బెట్టింగ్‌కు అలవాటుపడుతున్నారు.