మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల ఈ పథకం అమలులో ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఢిల్లీ, కర్నాటకలోనూ కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఏ రాష్ట్రం మహిళ అయినా ఎలాంటి గుర్తింపు కార్డు చూపించకుండా ప్రయాణం చేయవచ్చు.
కర్నాటక రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రం దాటి 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కానీ, తెలంగాణలో అనేక ఆంక్షలు, పరిమితులతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. పురుషాధిక్యత భావజాలం ఉన్నవారు ఈ పథకం అవసరం లేదని, ఆడవారు వంటిల్లు దాటరాదని భావిస్తున్నవారు. ఏవేవో కారణాలతో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
సంవత్సరం కాలంగా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలవుతున్న ఫలితాలు చూస్తే అనేక వాస్తవాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాదు పెద్ద హాస్పిటళ్లకు 30% పైగా ఓపీలు పెరిగాయని ఓ సర్వేలో తేటతెల్లమైంది. మహిళలు వారికి అందుబాటులో ఉన్న పీహెచ్సీ నుంచి ఏరియా ఆసుపత్రులకు, జిల్లా హాస్పిటల్ కు వెళ్లి అనారోగ్య సమస్యలు చూపించుకోవటానికి ఈ పథకం చాలా అనుకూలంగా ఉందని సర్వేలో తేలింది.
మహిళలకు ఉపయోగకరం
ఈ పథకం అమలులో లేనప్పుడు 50% మాత్రమే ఉన్నారు. ఇపుడు మహిళలు 80% వరకు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. హాస్పిటల్స్లో గైనిక్ ఓపీలు 20% పైగా పెరిగాయని తెలుస్తోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల సరైన వేతనాలు లేకపోవడం కారణంగా నిర్మాణ రంగాలలోకి అడుగుపెడుతున్న మహిళా కూలీలు అందుబాటులో ఉన్న పట్టణానికి బస్సుల్లో వెళుతున్నారు. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, కిరాణా షాపులలో పెట్రోల్ బంకులలో, ఇతర సంస్థలలో పనిచేస్తున్న మహిళలకు ఈ పథకం ఎంతో సహకారంగా, ఉపయోగకరంగా ఉంది.
మహిళలకు అందుతున్న వేతనాలకు మార్కెట్లో ధరలకు విపరీతమైన వ్యత్యాసం ఉన్న ఈ రోజుల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో కనీసం నెలకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చు మిగులుతోంది. ఈ ఖర్చును బిడ్డల చదువుల కోసం, ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నారు. అన్ని పట్టణ కేంద్రాలకు కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి మహిళలు ప్రయాణించి కార్మికుల అడ్డాకు వస్తున్నారు. పని దొరికితే పరవాలేదు. పని దొరకని రోజుల్లో మహాలక్ష్మి పథకం లేనప్పుడు కనీసం రోజుకు వంద రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా ఆదాయం కూడా పెరిగినట్టు వారి నివేదికలు తెలియజేస్తున్నాయి.
పథకం అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఈ పథకం అమల్లోకి వచ్చాక ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఒక్కసారిగా బస్సుల్లో ప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. కొన్ని సందర్భాలలో సీట్ల కోసం మహిళలు ఘర్షణ పడుతున్నారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మగవారు తప్పనిసరి అయితే తప్ప ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు ఎక్కే సాహసం చేయడం లేదు. దీనికి కారణం ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వ వైఫల్యమే. మహిళా ప్రయాణికులు సంఖ్య అధికంగా ఉన్న స్టాపుల్లో బస్సులు ఆపకుండా దూరంగా తీసుకెళ్తున్నారు. తక్షణ ఆదాయం వచ్చే పురుష ప్రయాణికులు ఉన్నచోట బస్సులు ఆపుతున్నారు.
Also Read : సామాన్యులకో న్యాయం.. సెలెబ్రెటీలకో న్యాయమా?
ఏదో ఒక కొర్రి పెట్టి ఆధార్ కార్డు అప్డేట్ లేదని, ఆధార్ కార్డులో ఫొటోకి మనిషికి సరిపోవటం లేదని బలవంతంగా జీరో టికెట్ కాకుండా డబ్బులు వసూలు చేసి టికెట్లు కొడుతున్నారు. తామే ఉచితంగా తీసుకెళుతున్నట్లు, తమ సొంత వెహికల్లో ఉచితంగా తీసుకెళుతున్నట్లు కండక్టర్లు విసుక్కోవటం, బస్టాండుల్లో ఎంక్వైరీ సిబ్బంది కసురుకోవటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
మహిళలను అవమానిస్తున్న కండక్టర్లు, సిబ్బంది
56 సీట్లు కలిగిన బస్సులో 90 మంది ప్రయాణికులు ఉండటం వల్ల స్టాపులో బస్సులు ఆపడం లేదు. అనేక గ్రామీణ రూట్లలో సర్వీస్ రద్దు చేశారు. తెలంగాణలో సుమారుగా 3000 సర్వీసులు రద్దు అయినట్లు ఒక అంచనా, బస్సుల సంఖ్య తక్కువ ఉండటంతో మహిళా ప్రయాణికులతోపాటు పురుష ప్రయాణికులు సీట్లు లేక గంటలపాటు నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే కొనసాగితే, పబ్లిక్ రవాణాపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్ని రూట్లలో రాత్రిపూట పల్లె వెలుగులు లేకపోవడం, స్టాపుల్లో బస్సులను ఆపమంటే ఆపకపోవడంతో రాత్రివేళల్లో మహిళలు ఉద్యోగులు ప్రయాణం చేయలేకపోతున్నారు. రాత్రివేళల్లో మహిళలు కోరిన చోట బస్సులు ఆపేటట్లు చర్యలు తీసుకోవాలి. మహిళలు వేడుకుంటున్నా డ్రైవర్లు సహకరించడం లేదు.
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ఏ నిబంధనైనా ప్రజల సౌకర్యార్థం మానవీయ కోణం నుంచి అమలు చేయాలని ఆర్టీసీ తమ ఉద్యోగస్తులకు బోధించాల్సి ఉంది. కిటికీలు పగిలిపోయి ఉండటం, సీట్లు చినిగిపోవడం, విరిగిపోయి ఉండటం, చలికాలం చలిగాలి బస్సులోకి ప్రవేశించటంతో సీనియర్ సిటిజన్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులు మొరాయించడం లాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. బస్టాండుల్లో ఉన్న మూత్రశాలలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
రాష్ట్రంలో ఎక్కడా లేని ఎక్కువ రేట్లకు బస్టాండ్ షాపుల్లోని వస్తువులు అమ్ముతున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల బస్టాండ్లలో రద్దీ పెరగటం వల్ల గతం కంటే ఎక్కువగా బస్టాండ్లలో దొంగతనాల సంఖ్య నమోదవుతోంది. సీసీ కెమెరాలు, పోలీస్ పహారాలను పెంచవలసిన అవసరం ఉంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీకి కావాల్సినన్ని బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికుల సౌకర్యాల్ని మెరుగుపరచాలి. మహిళలను మహాలక్ష్మిగా, మహారాణులులాగ చూడాల్సిన ప్రభుత్వం వారిని అవమానించకుండా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపైనే ఉన్నది.
- కే. లక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు-