ఒడిశాలో 1999 నాటి రేప్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
భువనేశ్వర్: ఓ అమ్మాయిని రేప్ చేసి పరారైండు. ఐడెంటిటీ మార్చుకుని ప్లంబర్‌గా పనిచేస్తూ తప్పించుకున్నడు. కానీ.. ఇరవై రెండేండ్ల తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. ఒడిశాలో సంచలనం రేపిన1999 నాటి గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు బిబేకానంద బిస్వాల్ అలియాస్ బిబాన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మహారాష్ట్ర లోనావాలాలోని ఆంబీ వ్యాలీలో బిబాన్‌ను అదుపులోకి తీసుకున్నామని భువనేశ్వర్–కటక్ పోలీస్ కమిషనర్ ఎస్. సారంగి వెల్లడించారు. ఆపరేషన్ సైలెంట్ వైపర్ పేరుతో 3నెలల క్రితం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
1999 జనవరి 9న భువనేశ్వర్ నుంచి కటక్‌కు జర్నలిస్ట్ ఫ్రెండ్‌తో పాటు కారులో వెళుతున్న అంజనా మిశ్రాను బారంగ్ వద్ద ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ప్రదీప్ సాహు, టూనా మొహంతిలను ఘటన జరిగిన వారం రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. 2002లో ఖుర్దా జిల్లా సెషన్స్ జడ్జి నిందితులకు జీవితకాల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆ తీర్పును హైకోర్టు కూడా సమర్ధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న బిస్వాల్.. ఐడెంటిటీ మార్చుకుని ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. రాష్ట్రంలో ఈ కేసు సంచలనం రేపడంతో.. అప్పటి సీఎం జేబీ పట్నాయక్ రాజీనామా కూడా చేశారు. అప్పట్లోనే ఈ కేసును సీబీఐకి అప్పగించారు.