పోచారం కెనాల్‌‌ శిథిలం.. కూలుతున్న కాల్వ సైడ్​ వాల్

కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న పోచారం ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌‌ శిథిలావస్థకు చేరుతోంది. ఏళ్లుగా కెనాల్‌‌ మెయింటెన్స్‌‌, రిపేర్లు చేయడపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం కష్టంగా మారుతోంది. ప్రాజెక్టు ఎత్తు పెంపుతో పాటు కెనాల్​ఆధునికీకరణపై శ్రద్ధ చూపాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 100  ఏళ్ల కింద నిర్మించిన కట్టడం చెక్కు చెదరకుండా ఉంటే 15 ఏళ్ల కింద నిర్మించిన సైడ్ వాల్ కూలిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 

2.4 టీఎంసీల సామర్థ్యంతో..

సాగు నీటి ఇబ్బందులు తీర్చేందుకు నిజాం సర్కారు 1917లో పోచారం ప్రాజెక్ట్‌‌ను మొదలు పెట్టింది. 2.4 టీఎంసీల సామర్థ్యంతో  రూ.17.11 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌‌ 1922లో కంప్లీట్​ అయ్యింది. దీని కింద నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని 42 ఊర్లలో 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయా ఊర్లలోని భూములకు సాగు నీళ్లు అందించేందుకు 58 కిలోమీటర్ల మెయిన్​ కెనాల్ ఉంది. 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ప్రాజెక్ట్‌‌ నిర్మాణ టైంలోనే  కెనాల్ తవ్వారు. మట్టితో తవ్విన కెనాల్ కావడంతో చాలా చోట్ల పూడుకపోవడం వల్ల చివరి ఆయాకట్టు వరకు నీరు చేరకపోవడం, నేలల్లోకి నీరు ఇంకిపోయేది. 

15 ఏళ్ల కింద సైడ్ వాల్ నిర్మాణం

మట్టి కెనాల్‌‌ను ఆధునికీకరించాలని రైతులు చాలా ఏళ్లు డిమాండ్​ చేశారు. దీంతో 2015లో అప్పటి సీఎం వైఎస్సార్​ పోచారం ప్రాజెక్ట్‌‌ మెయిన్ కెనాల్ కోసం రూ.100 కోట్ల ఫండ్స్ కేటాయించారు. కెనాల్ సైడ్ వాల్ నిర్మాణం,  సిమెంట్​ లైనింగ్ పనులు చేపట్టేందుకు ఈ ఫండ్స్ కేటాయించారు. ఈ పనులు  నాలుగేండ్ల పాటు సాగాయి. 15 ఏళ్లలోనే సైడ్ వాల్ కూలిపోయి.. కింది భాగంలో సిమెంట్​ లైనింగ్‌ కొట్టుకుపోయింది. మరో వైపు ప్రాజెక్టులో కూడా పూడిక పేరుకుపోయి వర్షాకాలంలో వచ్చే వరద వృథాగా పోతుంది.  పలు చోట్ల కెనాల్‌‌కు ఇరువైపుల రాళ్లు ఊడిపోయాయి. పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడి కెనాల్ శిథిలమైంది. దీంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు.  ఇటీవలి కాలంలో  మెయిన్​ కెనాల్ రిపేర్‌‌‌‌కు ఫండ్స్​ రిలీజ్ కాలేదు. శిథిలమైన చోట లైనింగ్‌‌కు రిపేర్ చేస్తే ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి కెనాల్ రిపేర్‌‌‌‌తో పాటు ప్రాజెక్ట్‌‌ ఎత్తు పెంపునకు ఫండ్స్​ రిలీజ్ చేయాలని రైతులు కోరుతున్నారు.

రాళ్లు ఊడిపోతున్నయ్​

పోచారం కెనాల్‌‌కు రెండు వైపుల రాళ్లు ఊడిపోతున్నాయి. కెనాల్ మొదలయ్యే చోటు నుంచి లోపలకు వెళ్తే చాలా దగ్గర రాళ్లు ఊడిపోయి పెద్దపెద్ద రంద్రాలు ఏర్పడ్డాయి. దీంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి.  రిపేర్​ చేస్తే  బాగుంటుంది.
-  సాయిలు,  నాగిరెడ్డిపేట మండలం 

నీళ్లు రావటం లేదు

కాల్వకు చాలా చోట్ల రాతి కట్ట కూలిపోయింది. కింద వేసిన సిమెంట్ కొట్టుకుపోయింది.   కాల్వకు చివరన ఉన్న భూముల నీళ్లు రావడం లేదు. కాల్వకు రిపేర్​ చేయడంతో పాటు ప్రాజెక్టు ఎత్తు పెంచితే మేలు జరుగుతుంది.  
‌‌‌‌ ‌‌‌‌ - పర్వయ్య, ఎల్లారెడ్డి మండలం