మర్డర్​ జరిగి  రెండు వారాలైనా నిందితులను పట్టుకోలె

  • పరారీలోనే కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్య
  • మర్డర్​ జరిగి   రెండు వారాలైనా దొరకలే
  • ప్రత్యక్షంగా పాల్గొన్న 8 మంది మాత్రమే అరెస్ట్

ఖమ్మం, వెలుగు: తెల్దారుపల్లిలో టీఆర్ఎస్​ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన సూత్రధారులను ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే, నడిరోడ్డుపై హత్య జరిగి రెండు వారాలు అవుతున్నా, మర్డర్​ కు స్కెచ్​ వేసిన తమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్య ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆగస్టు 15న కృష్ణయ్య మర్డర్​ జరగ్గా, 18న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. కానీ పోలీస్​ రిమాండ్​ రిపోర్టులో చెప్పినట్టుగా హత్యకు పథకాన్ని రచించిన వారిలో తమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్య ఎక్కడున్నారనేది మాత్రం ఇంకా పోలీసులు కనిపెట్టలేదని చెబుతున్నారు. పోలీసులు చెబుతున్న కారణాలు అనేక సందేహాలకు కారణమవుతుండగా, మృతుని కుటుంబ సభ్యులు పోలీసులే ప్రధాన నిందితులను తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సమాచారం ఉన్నా పట్టుకోలే.. 

మర్డర్​ కేసులో ఈనెల 18న ఖమ్మం రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వెంకటగిరి క్రాస్​ రోడ్​లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు మహబూబాబాద్​ నుంచి కొత్తగూడెం మీదుగా వైజాగ్ వెళ్లారు. అక్కడి నుంచి కోటేశ్వరరావుకు ఫోన్​ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చి రూ.40 వేలు డబ్బులు తీసుకొని మళ్లీ వైజాగ్ వెళ్లిపోయారు. దీని ప్రకారం సెల్ ఫోన్ల ద్వారా నిందితులంతా కాంటాక్ట్ లో ఉన్న విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోవడం, కోటేశ్వరరావు వాడుతున్న సెల్ ఫోన్​ ఆధారంగా అతన్ని ట్రాక్​ చేయలేకపోవడం పోలీసుల వైఫల్యమేనని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరికి సంబంధించిన సమాచారం ఉన్నా పోలీసులు కావాలనే వాళ్లిద్దరినీ పట్టుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇక హత్య జరిగిన తర్వాత కూడా తమకు బెదిరింపులు వస్తున్నాయని మృతుని కుటుంబసభ్యులు అంటున్నారు. దీనిపై తాజాగా ఖమ్మం పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ ను కలిసి మృతుడి కుమారుడు తమ్మినేని నవీన్​ ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన తర్వాత తమపై కూడా దాడి చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, అందుకు తగిన ఆధారాలను సీపీకి అందజేశారు. 

ఆరు నెలల ముందే మర్డర్​ ప్లాన్..

కృష్ణయ్య హత్య జరగడానికి రెండ్రోజుల ముందే తాను త్వరలోనే దుబాయ్​ పోతున్నట్టుగా కోటేశ్వరరావు కొంతమంది సన్నిహితులకు చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మర్డర్​ కు ముందు ఒక పెళ్లికి సంబంధించి బంధువులు కోటేశ్వరరావుకు ఇన్విటేషన్ ఇచ్చేందుకు​ రాగా, దుబాయ్ వెళ్తున్నానని​ శుభకార్యానికి రాలేనని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్నెళ్ల క్రితం మర్డర్​ ప్లాన్ వేసినట్టుగానే, హత్య తర్వాత ఎక్కడికి వెళ్లాలనే స్కెచ్​ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం కోటేశ్వరరావు కోసం తాము గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

పోలీసులు కావాలనే తప్పించారు

నాన్న హత్య కేసులో ఖమ్మం రూరల్​ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయి. తమ్మినేని కోటేశ్వరరావు, నాగయ్య ఎక్కడున్నారో తెలిసినా పోలీసులు పట్టుకోకుండా తప్పించారు. వాళ్లిద్దరూ విజయవాడ, వైజాగ్​ నుంచి కేరళ మీదుగా దుబాయ్​కు పరారైనట్లు మాకు సమాచారం ఉంది. హత్య జరిగిన తర్వాత రోజు వాళ్లిద్దరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్​ను పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు.  
- తమ్మినేని నవీన్, మృతుడి కుమారుడు