వందలాది యువకుల ప్రాణత్యాగాలు, లక్షలాది ప్రజల దశాబ్దాల పోరాటాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో తెలంగాణ అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ప్రధానంగా తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ పాలన తెలంగాణ విద్యుత్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. రైతులకు 24 గంటల పేరుతో సరఫరా చేసిన విద్యుత్తు ఖర్చులను భరించకుండా విద్యుత్ సంస్థలను నట్టేట ముంచారు. కేవలం ఐదు గంటల విద్యుత్ సరఫరాకు డబ్బులిచ్చి, మిగిలిన విద్యుత్తుకు అయిన ఖర్చులను విద్యుత్ సంస్థలకు చెల్లించకుండా ఎగ్గొట్టింది.
దీంతో విద్యుత్ సంస్థలు అధిక వడ్డీలకు వేలకు వేల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల ఊబిలోకి కూరుకు పోయాయి. తెలంగాణ అప్పులు, వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు మార్చి 2023 నాటికి రూ 1,63,583 కోట్లకు చేరుకున్నాయి. అప్పులు చేయకుంటే రోజు గడవని పరిస్థితిలోకి విద్యుత్ సంస్థలను గత ప్రభుత్వం నెట్టివేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేకూర్చిన ఆస్తులు కూడా పూర్తిగా నిరర్ధకంగా మారే ప్రమాదం ఉంది. అశాస్త్రీయంగా, కాలం చెల్లిన సాంకేతికతో, గోదావరి మునకకు సమీపంలో కట్టిన భద్రాద్రి పాజెక్టు, బొగ్గు లభ్యతకు 270 కిలోమీటర్ల దూరంలో, భారీ వ్యయంతో నిర్మాణమౌతున్న యాదాద్రి ప్రాజెక్టు తెలంగాణకు తలకు మించిన భారంగా మారనున్నాయి.
2014 కు ముందు, తరువాత కేంద్రంలోని ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో తీసుకున్న అనేక చర్యల కారణంగా 2014 నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ పరిస్థితి మెరుగు పడింది. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా విద్యుత్ పరిస్తితి మెరుగుపడడం జరిగింది. బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను కాపాడుకోవడం, రైతులకు, ఇతర వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందజేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న ప్రధాన బాధ్యత.
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపులో బీఆర్‌ఎస్ పాలకులు సాధించిందేమిటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత స్థాపించిన 11,697 మెగావాట్ల అదనపు సామర్థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాకుండా, ఇతరుల ద్వారా.. అంటే కేంద్ర విద్యుత్ సంస్థలు, ప్రైవేటు రంగం మొదలైనవాటి నుంచి మనకు వచ్చినది సుమారు 8,410 మెగావాట్లు. మిగిలిన 3,287 మెగావాట్లలో గత కాంగ్రెస్ హయాంలో సింహభాగం పూర్తి చేసుకున్న సింగరేణి ప్రాజెక్టు (1200 మెగావాట్లు), కాకతీయ ప్రాజెక్టు (600 మెగావాట్లు)లు కాకుండా వచ్చిన సామర్థ్యం కేవలం 1487మెగా వాట్లు మాత్రమే.
ఇందులో 1080 మెగావాట్ల భద్రాద్రి ప్రాజెక్టు కాలం చెల్లిన సబ్ క్రిటికల్ సాంకేతికత, భారీ నిర్మాణ ఖర్చు, నాణ్యతా లోపాలు, గోదావరి మునక ప్రాంతంలో ఉన్నకారణంగా తెలంగాణకు ఒక తెల్ల ఏనుగులా మిగలనుంది. అంటే బీఆర్‌ఎస్ పాలకులు తెలంగాణకు పనికొచ్చేవిధంగా విద్యుత్ సామర్థ్యం పెంచింది దాదాపు శూన్యం. విద్యుత్ స్థాపిత సామర్థ్యం భారీగా పెంచామనే బీఆర్‌ఎస్ పాలకుల మాటలు పూర్తిగా అవాస్తవమని మనకు స్పష్టమౌతున్నది.
కె. రఘు, విద్యుత్వ రంగ నిపుణుడు