హైదరాబాద్ లో స్ట్రీట్ లైట్ల వ్యవస్థ అస్తవ్యస్తం

హైదరాబాద్ లో స్ట్రీట్ లైట్ల వ్యవస్థ అస్తవ్యస్తం
  • ఫైన్లు వేస్తున్నా.. పట్టింపు లేదు!
  • నిత్యం 20 శాతానికిపైగా లేట్లు వెలగవు 
  •  కొన్నిచోట్ల టైమర్లు పని చేయవు 
  • ఇంకొన్ని ప్రాంతాల్లో చీకట్లు 
  • ఈఎస్‌‌ఎల్ సంస్థకు 6 నెలల్లో రూ.6.50 కోట్ల ఫైన్లు  
  • ఎల్‌‌ఈడీ బల్బుల స్టాక్ సైతం ఉంచట్లేదు
  • వీటిపైనే బల్దియాకు  జనాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు : సిటీలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.  గ్రేటర్ లో నిత్యం 15 నుంచి 20 శాతం లైట్లు వెలగడం లేదు. టైమర్లు పని చేయక కొన్నిచోట్ల రోజంతా వెలుగుతాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట అసలే వెలగడం లేదు. దీంతో సాయంత్రం ఆరు దాటితే ఆయా ఏరియాల్లో మెయిన్ రోడ్ల నుంచి కాలనీలు, బస్తీలు చీకట్లు కమ్ముకుంటుండగా స్థానికులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో​ 2  నుంచి 5  శాతం స్ట్రీట్​లైట్లు మాత్రమే పని చేయడం లేదని అధికారులు చెబుతుండగా.. దాదాపు15 నుంచి 20 శాతం లైట్లు వెలగడం లేదు.  కేవలం పర్యాటక ప్రాంతమైన ట్యాంక్​బండ్​, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి తదితర ఏరియాలపైనే అధికారులు దృష్టి పెడుతుండగా, పబ్లిక్​ప్లేసులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 

స్ర్టీట్​లైట్లు వెలగని ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరుగుతుండగా స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  సిటీలో రూ.217.12 కోట్లతో ఎల్‌‌‌‌ఈడీ లైట్లను బల్దియా ఏర్పాటు చేసింది.  వీటిని టెక్నాలజీ ద్వారా పరిశీలిస్తుండగా..  98 శాతం వెలుగుతున్నాయని అధికారులు పేర్కొంటుండగా, ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రద్దీ  రోడ్లలో వీధి లైట్లు, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్​ లైట్లు కూడా వెలగడం లేదు. వీటి నిర్వహణను ఈఎస్‌‌‌‌ఎల్ సంస్థ సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదు. గడిచిన 6  నెలల్లో రూ. 6.50 కోట్ల జరిమానాను బల్దియా అధికారులు సంస్థకు వేశారు. అయినా మార్పు కనిపించడం లేదు. 

నెలకు రూ. 8 కోట్లు చెల్లింపు

సిటీలో వీధి  లైట్ల సమస్యపై రోజుకు 800 నుంచి 1,800 వరకు ప్రజల నుంచి బల్దియాకు ఫిర్యాదులు వెళ్తున్నాయి.  వార్డు ఆఫీసుల్లోనే ఎక్కువగా కంప్లయింట్ చేస్తున్నారు.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో ఎల్ఈడీ  లైట్ల నిర్వహణను ఈఎస్ఎల్ చూస్తుండగా..  వచ్చే ఫిర్యాదులకు పరిష్కరించిన వాటికి పొంతన ఉండడంలేదు. అగ్రిమెంట్‌‌‌‌ మేరకు  లైట్ల స్టాక్‌‌‌‌ ఈఎస్ఎల్ మెయింటెన్స్ చేయడం లేదు. బఫర్ స్టాక్ 10 శాతం మెయింటెన్స్‌‌‌‌ కూడా పట్టించుకోవడం లేదు. 26,398 ఎల్ఈడీ లైట్ల స్టాక్ ఉండాలి. కేవలం 4,945 స్టాక్ మాత్రమే ఉంది. చాలా చోట్ల స్తంభాలు ఏర్పాటు చేసినా ఎల్ఈడీ లైట్లు లేక ఇన్‌‌‌‌స్టాలేషన్ చేయడంలేదు. 35 వాట్స్, 70 వాట్స్ ఎల్ఈడీ  లైట్ల కొరత చాలా ఉంది. వీధిలైట్ల నిర్వహణ ఏజెన్సీలు పని, బఫర్ స్టాక్‌‌‌‌ను మెయింటెన్ చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. రూల్స్ మేరకు  సిటీలో 98 శాతం  లైటింగ్ ఉండాలి. కానీ.. లైట్లు వెలగకపోయినా నెలకు రూ.8 కోట్ల బిల్లులను ఏజెన్సీలకు బల్దియా చెల్లిస్తుంది. 

డార్క్ స్పాట్లుగా గుర్తిస్తూ..

గ్రేటర్  పరిధిలో 5,26,136 లక్షల స్ర్టీట్​ లైట్లు ఉన్నాయి.  వీటిలో 4 లక్షలు మెయిన్ రోడ్లు, వీధుల్లో ఉండగా, 54 వేలకు పైగా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి.  వీటితో పాటు హైమాస్ట్  లైట్లు 6,531 కూడా ఉన్నాయి.  బల్దియాకు వస్తున్న ఫిర్యాదుల్లో 20 నుంచి 30 శాతం వరకు స్ర్టీట్​లైట్లవే ఉంటున్నాయి. గతేడాది 42 వేల కంప్లయింట్స్​వచ్చాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో వస్తుండగా వాటిని అధికారులు డార్కు స్పాట్లుగా గుర్తిస్తున్నారు. లైట్లను మాత్రం ఏర్పాటు  చేయకుండానే చేసినట్లు చూపుతున్నారు.  దీంతో రాత్రి పూట రోడ్లపై ప్రయాణించాలంటే భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది.

క్షేత్రస్థాయిలో చర్యల్లేవ్ 

మెహిదీపట్నం, నాగోల్​, బంజారాహిల్స్, లంగర్ హౌస్, నానల్​నగర్​, రేతిబౌలి, బంజారాహిల్స్​, నాంపల్లి, రాజేంద్రనగర్ ఇలా పలు ప్రాంతాల్లో మెయిన్ రోడ్లు, కాలనీల్లో లైట్లు వెలగకపోతుండగా ప్రజలు ఏదైనా పనిమీద బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్​మెయిన్​రోడ్లపైనా స్ర్టీట్​లైట్లు వెలగడంలేదు. పరిస్థితి ఇలాగే ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు అన్నిచర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి.