జమ్మికుంట, వెలుగు: తన కుటుంబ సమస్యను పరిష్కరించడం లేదంటూ వెళ్లి సర్పంచ్తల్లిని చంపిన ఘటనలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ జీవన్ రెడ్డి జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన రామంచ కుమారస్వామి మద్యానికి బానిసై తన భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై కుమారస్వామి సర్పంచ్ రజిత భర్త వాసుదేవరెడ్డి దగ్గరికి వచ్చి తన సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఆయన ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాగా ఈ విషయంలో సర్పంచ్ భర్త తన సమస్యను సరిగా పట్టించుకోవడంలేదని కక్ష పెంచుకొని ఆయనను చంపేందుకు కత్తి పట్టుకొని వెళ్లాడు. ఆ టైంలో ఎదురుగా వచ్చిన వాసుదేవరెడ్డి తల్లి లక్ష్మి(70)ని కత్తితో పొడిచి చంపాడు. గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ జీవన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ కిశోర్, ఎస్సై రాజ్ కుమార్ ఉన్నారు.