బయటపడ్డ హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం యెన్కెపల్లి సమీపంలోని హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవన్ అక్రమాలకు పాల్పడ్డాడని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు తెలియకుండా కాలేజీ విద్యార్థుల నుండి ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేశాడని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తోంది. దాదాపు రూ.39 లక్షలు విద్యార్థుల నుంచి ప్రిన్సిపాల్ జీవన్ కాజేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకునేందుకు వెళ్లినప్పుడు ప్రిన్సిపాల్ బాగోతం బయటపడింది. 

విషయం బయటపడింది ఇలా.. 

సర్టిఫికెట్లు తీసుకునేందుకు విద్యార్థులు కాలేజీకి వెళ్లారు. అయితే.. ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీ యాజమాన్యం చెప్పింది. దీంతో విద్యార్థులందరూ డబ్బులు కట్టినట్లు తమ వద్ద ఉన్న పత్రాలతో కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం రికార్డులను పరిశీలించడంతో అసలు విషయం తెలిసింది. విద్యార్థులు ఫీజలు కట్టారని, అయితే.. అవి యాజమాన్యం తెలియకుండా ప్రిన్సిపాల్ జీవన్ ఆ డబ్బులను కాజేశారని గుర్తించింది. ఫేక్ రిసిప్ట్ లను విద్యార్థులకు ఇచ్చి.. వారి నుంచి ప్రిన్సిపాల్ జీవన్ డబ్బులు వసూలు చేసినట్లు కాలేజీ యాజమాన్యం గుర్తించింది. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపాల్ ను నిలదీసింది. 

అయితే.. డబ్బులు సెటిల్ మెంట్ చేసేందుకు సమయం అడిగి.. అక్కడి నుంచి ఉడాయించాడు ప్రిన్సిపాల్ జీవన్. మరోవైపు.. సర్టిఫికెట్ల విషయంపై కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థులు నిలదీశారు. మొదట మొండికేసినా.. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చేసింది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ప్రిన్సిపాల్ పై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమను మోసం చేసిన ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.