మట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ

మట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌‌లో బొగ్గు కోసం వెలికి తీసిన మట్టి నుంచి ఇసుకను తయారు చేసే ప్రక్రియను మేనేజ్‌‌మెంట్ ప్రారంభించింది. సింగరేణి విస్తరించిన ప్రాంతంలో గోదావరి నది నిత్యం నీటితో నిండుకుండను తలపిస్తుండడంతో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇండ్లు, ఇతర నిర్మాణాలకు ఇసుక కోసం సింగరేణిలో మొదటిసారిగా గోదావరిఖనిలోని మేడిపల్లి ఓసీపీలో ఈ ప్లాంట్‌‌ను నెలకొల్పారు. ల్యాబ్‌‌ టెస్ట్‌‌ల తర్వాత త్వరలోనే కమర్షియల్‌‌ సాండ్‌‌ను  మార్కెట్‌‌లో విక్రయించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. సింగరేణి అండర్‌‌ గ్రౌండ్ మైన్‌‌లలో బొగ్గు వెలికితీసిన తర్వాత ఆ ఖాళీ ప్రదేశాన్ని నింపేందుకు గతంలో గోదావరి నదిలో ఉన్న ఇసుకను వాడేవారు. గని పైనున్న బంకర్‌‌ ద్వారా ఇసుకను నీటితో కలిపి వర్కింగ్‌‌ ప్లేస్‌‌కు తరలించేవారు.

అండర్‌‌ గ్రౌండ్ మైన్ల వద్ద గల ఖాళీ ప్రదేశాల్లో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉండేవి. దీనికితోడు సింగరేణిలో క్వార్టర్ల నిర్మాణం, రిపేర్లకు అవసరమైన ఇసుకను కూడా గోదావరి నది నుంచి తెచ్చేవారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా గోదావరి నదిపై బ్యారేజీలు నిర్మించడంతో నిత్యం నీటి ప్రవాహం కనిపిస్తున్నది. దీంతో గోదావరినదిలో ఇసుక లభ్యతకు బ్రేక్‌‌ పడింది. ఈ క్రమంలో సింగరేణి సంస్థ ఎన్టీపీసీ, ఇతర విద్యుత్‌‌ ప్రాజెక్ట్‌‌లలో బొగ్గు మండించడం ద్వారా విడుదలయ్యే బూడిదపై ఆధారపడింది.  

ఓబీతో ఇసుక తయారీ

గోదావరిఖనిలోని మేడిపల్లి ఓపెన్‌‌ కాస్ట్‌‌ (ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌‌ మూసివేశారు) లో ఓవర్‌‌ బర్డెన్‌‌ (ఓబీ‒మట్టి) నుంచి ఇసుకను తయారు చేసేందుకు మేనేజ్‌‌మెంట్‌‌ టెండర్లు పిలవగా హైదరాబాద్‌‌కు చెందిన ఎ హోమ్‌‌ కన్సల్టెంట్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్ సంస్థ టెండర్‌‌ దక్కించుకుంది. ఇటీవలే మట్టి నుంచి ఇసుకను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించింది. మట్టి సైజు 600 మిల్లీ మీటర్లు ఉండగా, దానిని క్రషర్లలో వేసి వివిధ దశల్లో ప్రాసెస్‌‌ చేస్తున్నారు. 5 ఎంఎం సైజులో ఉన్నప్పుడు వాషింగ్‌‌ ప్లాంట్‌‌లో వేసి బిల్డింగ్‌‌లు, ఇతర నిర్మాణాలకు ఉపయోగపడేలా మాన్యుఫాక్చరింగ్‌‌ సాండ్(4.75 ఎంఎం నుంచి 2.40 ఎంఎం వరకు), ప్రాసెసింగ్‌‌ సాండ్ (2.40 ఎంఎం నుంచి 75 మైక్రాన్ల వరకు) అనే రెండు రకాల ఇసుకను బయటకు తీస్తున్నారు. 

క్యూబిక్‌‌ మీటర్‌‌ తయారీకి రూ.126 చెల్లింపు

ఒక క్యూబిక్‌‌ మీటర్ ఇసుకను తయారు చేసినందుకు సింగరేణి సంస్థ కన్సల్టెంట్‌‌ కంపెనీకి రూ.126  చెల్లిస్తున్నది. దీంతో పాటు క్యూబిక్‌‌ మీటర్‌‌ ఇసుక తయారీ కోసం 1,500 లీటర్ల నీరు, అవసరమైన భూమి, 3.5 యూనిట్ల కరెంట్‌‌, డంప్‌‌ యార్డు సమకూరుస్తోంది. భూకంపాలను కూడా తట్టుకునేలా ఇసుకను ప్రాసెస్‌‌ చేస్తున్నారు. వీటి శాంపిళ్లను హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌‌కు పంపించారు. అక్కడి నుంచి రిజల్ట్‌‌ వచ్చిన తర్వాత కార్పొరేట్ ఆఫీస్‌‌ నుంచి క్యూబిక్‌‌ మీటర్‌‌ ఇసుకకు తగిన రేట్ నిర్ణయించి ప్రజల అవసరాల కోసం విక్రయించనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఆరేండ్లపాటు ఇసుక తయారు చేసే కాంట్రాక్టు లభించింది. ఓపెన్‌‌ కాస్ట్‌‌లో 200 లక్షల క్యూబిక్‌‌ మీటర్ల మట్టి ఉండగా.. కొన్నేళ్లపాటు కమర్షియల్‌‌ సాండ్‌‌ను వెలికితీసే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఇసుక కష్టాలు తీరనున్నాయి.