అంగన్ వాడీ సెంటర్లు ఎట్ల నడపాలె!

  • 4 నెలలుగా కిరాయి, రెండేండ్లుగా ఈవెంట్ల పైసలు బంద్
  •     సెంటర్ల నిర్వహణకు జీతం పైసలు ఖర్చు చేస్తున్న టీచర్లు
  •     సీమంతం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కోసం అప్పులు
  •     బకాయిలు చెల్లించాలని డిమాండ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అంగన్ వాడీ సెంటర్ల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించకపోవడంతో సెంటర్ల అద్దెకు, ఆరోగ్యలక్ష్మి స్కీమ్, ఈవెంట్ల కోసం అంగన్​వాడీ టీచర్లు అప్పులు చేస్తున్నారు. కుటుంబ పోషణతోపాటు, సెంటర్లు నడిపేందుకు అరిగోస పడుతున్నారు. అద్దె గదుల్లో నడుస్తున్న సెంటర్లకు ప్రభుత్వం నాలుగు నెలలుగా కిరాయి పైసలు ఇవ్వడం లేదు. అలాగే సీమంతం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన ఈవెంట్లకు రెండేండ్లుగా బిల్లులు రిలీజ్​చేయడం లేదు.

ఏడాదిగా ఆరోగ్యలక్ష్మి బిల్లుల జాడేలేదు. దీంతో వచ్చిన జీతంలో సగం ఇంటి ఖర్చులకు, సగం సెంటర్ల నిర్వహణకు పెట్టుకుంటున్నారు. అప్పటికీ చాలక అప్పులు చేస్తున్నారు. గర్భిణులకు సీమంతం ఆపినా, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేయకపోయినా ఉన్నతాధికారులు ఊరుకోవడం లేదు. తప్పకుండా నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారు.

తాళాలు వేస్తున్న ఓనర్లు

జిల్లాలో మొత్తం 2,060 అంగన్​వాడీ సెంటర్లు నడుస్తుండగా, ప్రస్తుతం వీటిలో 8,444 మంది గర్భిణులు, 7,467 మంది బాలింతలు, మూడు నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు29,151 మంది ఉన్నారు. 2060 సెంటర్లలో 752 అద్దె ఇండ్లలో నడుస్తున్నాయి. రూరల్​ విభాగంలో ఒక్కోదానికి రూ.750 నుంచి రూ. 2,500 వరకు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో రూ.750 నుంచి రూ. 4 వేల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. గదులు, సౌకర్యాలను బట్టి అద్దె ఉంటుంది. కాగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కిరాయి బిల్లులను ప్రభుత్వం ఆపింది. దీంతో అద్దెలు కట్టేందుకు అంగన్​వాడీ టీచర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెంలోని కూలీలైన్​ఏరియాలోని సెంటర్​కు ఇంటి యజమాని తాళం వేశారు. ఆర్నెళ్లుగా అద్దె పెంచి ఇవ్వాలని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో యజమాని ఇంటికి తాళం వేశారు. 

పాల్వంచ సీడీపీఓ పరిధిలోని సెంటర్​కు సంబంధించి ఇంటి అద్దె కట్టడం లేదని ఇంటి యజమాని పెద్ద గొడవ చేశాడు. అంగన్​వాడీ టీచర్​అప్పటికప్పుడు రూ.3 వడ్డీకి రూ.10 వేలు అప్పుగా తీసుకుని అద్దె కట్టింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే ఉన్నాయి. అంగన్​వాడీ సెంటర్లలో ప్రతినెలా సీమంతం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన ఈవెంట్లు చేయాల్సి ఉండగా, నెలకు దాదాపు రూ.వెయ్యి ఖర్చు వస్తోంది. అయితే ప్రభుత్వం రెండేండ్లుగా వీటికి ఫండ్స్​ఇవ్వడం లేదు. తమ జీతం నుంచి ఖర్చు చేస్తున్నామని టీచర్లు వాపోతున్నారు.

ఇక గర్భిణులు,  బాలింతలకు సంబంధించిన ఆరోగ్యలక్ష్మి స్కీం పైసలు ఏడాదిగా రిలీజ్ కావడం లేదు. ఈ స్కీం అందించేందుకు నిత్యావసరాలు, కూరగాయలు అప్పుగా తీసుకొచ్చి వండి పెడుతున్నామని చెబుతున్నారు. ఆరోగ్యలక్ష్మికి సంబంధించిన బకాయిలను ఇటీవల కొంత విడుదల చేసినట్లు ఐసీడీఎస్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.  

ఎంత ఖర్చు వస్తుందంటే..

ఒక్కో అంగన్​వాడీ సెంటర్ లో గ్యాస్​కు రూ.1,200, రూమ్​అద్దెకు రూ.3 వేలు, ఈవెంట్లకు రూ. 1,000, నిత్యావసరాలు, కూరగాయలకు రూ. 1,000, సెంటర్​మెయింటెనెన్స్ కు రూ.500 నుంచి రూ. 700, సీడీపీఓ ఆఫీసుల్లో మీటింగ్స్​కు వెళ్లి వచ్చేందుకు, స్టేషనరీకి ఇలా మొత్తంగా నెలకు రూ.7,400 వరకు ఖర్చు వస్తోంది. అంగన్​వాడీ టీచర్​కు జీతం కింద నెలకు రూ. 13,500 వస్తుండగా, అందులో సగానికి పైగా సెంటర్​నిర్వహణకే పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

అంగన్​వాడీ సెంటర్లకు అద్దె బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆరోగ్యలక్ష్మి, ఈవెంట్లకు సంబంధించిన బకాయిలను కూడా రిలీజ్ చేయాలి. అప్పులు చెల్లించలేక అంగన్​వాడీ టీచర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలకు దిగుతాం.  

- మణి, అంగన్​వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షురాలు

 ఏ ఒక్కటీ సక్కగా రావట్లేదు

బకాయిల కోసం త్వరలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. నెలనెలా అంగన్​వాడీ సెంటర్లకు కిరాయి పైసలు ఇవ్వడం లేదు. అప్పులు చేసి అద్దె కడుతున్నాం. ఆరోగ్యలక్ష్మి డబ్బులూ సక్కగా రావడం లేదు.

- వెంకటమ్మ, అంగన్​వాడీ టీచర్స్, హెల్పర్స్​యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు