ప్రభుత్వ బడుల నిర్వహణను గాలికొదిలేసిన సర్కారు

  • నేటికీ చేతికందని నిధులు
  • జిల్లా ఖజానాలోనే నిక్షిప్తం!
  • గైడ్ లైన్స్ రాలేదని విడుదలకు విముఖత
  • కొత్త మండలాలకూ రూపాయి అందలే
  • టీచర్లకు భారంగా మారిన బడుల నిర్వహణ

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ బడుల నిర్వహణను సర్కారు గాలికొదిలేసింది. స్కూల్స్ గ్రాంట్లు రిలీజ్ కాకపోవడంతో మెయింటనెన్స్ అస్తవ్యస్తంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా.. హెడ్ మాస్టర్ల చేతికి మాత్రం రూపాయి అందలేదు. దీంతో హెచ్ఎంలు, టీచర్లు సొంత జేబుల్లోంచి ఖర్చు పెడుతూ స్కూళ్లను నెట్టుకొస్తున్నారు. నిర్వహణ కోసం ఒక్కో టీచర్ తక్కువలో తక్కువ రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు చేశారు.

అంతా అంకెల్లోనే..

2022–23 విద్యా సంవత్సరం ఇంకో నాలుగు నెలల్లో ముగుస్తుంది. కానీ ఇప్పటివరకు స్కూల్ గ్రాంట్లు చేతికందలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చూపుతున్నా.. అది ఖజానాలోనే నిక్షిప్తం అయింది. స్కూళ్ల నుంచి బిల్లులు పెట్టుకున్నా.. రూపాయి రావడం లేదు. పాత స్కూల్ అకౌంట్లను రద్దు చేసిన సర్కారు.. ఇటీవల అధికారులు కొత్త ఖాతాలు తెరిచారు. అయినా.. ఒక్క రూపాయి కూడా జమ కావడం లేదు. జనగామ జిల్లాలో 518 బడులు ఉండగా.. రూ.1.21కోట్లు రిలీజ్ అయినట్లు చూపారు. జయశంకర్ భూపాలపల్లిలో 444 బడులకు గాను రూ.92.5లక్షలు, హనుమకొండలో 495 స్కూళ్లకు రూ.1.31కోట్లు, మహబూబాబాద్ 1004 పాఠశాలలకు గాను రూ.1.97కోట్లు మంజూరు చేశామని సర్కారు చెప్పింది. ఇక వరంగల్ జిల్లాలో 662 స్కూళ్లకు గాను రూ.1.46కోట్లు, ములుగు జిల్లాలో 374 బడులకు గాను రూ.67.7లక్షలు సాంక్షన్ చేసినట్లు చూపింది. కానీ ఇవన్నీ లెక్కల్లోనే ఉన్నాయి చేతికి మాత్రం రూపాయి అందలేదు.

టీచర్లకు తిప్పలు..

స్కూల్ గ్రాంట్లు మంజూరు కాకపోవడంతో టీచర్లు, హెచ్ఎంలు తిప్పలు పడుతున్నారు. చాక్ పీస్ లు, డస్టర్లు, విద్యుత్ బిల్లులు, బకెట్లు, స్టేషనరీ కోసం సొంత జేబుల్లో నుంచే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఎస్టీవోకు పంపిన తర్వాత ఫ్రీజింగ్ పేరుతో మూడు నెలల పాటు వెయిట్ చేయిస్తున్నారు. దీంతో నిధులు చేతికి ఎప్పుడొస్తాయో తెలియక టీచర్లు సతమతం అవుతున్నారు. 2016లో ప్రకటించిన కొత్త మండలాలకు కూడా ఇప్పటి వరకు రూపాయి కేటాయించలేదు. ఎమ్మార్సీ భవనాలను నిర్మించినా.. వాటి నిర్వహణకు ఫండ్స్ రాకపోవడంతో.. పాత మండలాల నుంచే ఇన్ చార్జీ ఎంఈవోలు డ్యూటీ చేస్తున్నారు.

కరెంట్​ బిల్లులకూ సరిపోవట్లే..

తొర్రూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ గ్రాంట్లు రిలీజ్ చేయకపోగా.. ఇచ్చే గ్రాంట్లు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం తొర్రూరులో నిర్వహించిన ఆ సంఘం వజ్రోత్సవాలకు చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. వెంటనే స్కూల్ గ్రాంట్లను పెంచి, పెండింగ్ నిధుల్ని స్కూళ్లకు విడుదల చేయాలన్నారు. ఏడేండ్ల నుంచి ప్రమోషన్లు, నాలుగేండ్ల నుంచి ట్రాన్స్ ఫర్లు లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్కూళ్లలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా సర్కారు భర్తీ చేయడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు సుధాకరాచారి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆట సదయ్య, బి.రమేశ్, జనగామ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు సూర రమేశ్​తదితరులున్నారు.

గ్రాంట్స్ వెంటనే రిలీజ్ చేయాలి

గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు స్కూళ్ల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా రాలేదు. గతంలో ఉన్న ఖాతాలను క్లోజ్ చేశారు. అందులో ఉన్న నిధులు ట్రెజరీకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో స్కూళ్ల నిర్వహణ భారంగా మారింది. సొంత పైసలతో నెట్టుకొస్తున్నాం.
- డి. మాధురి, హెచ్ఎం, సీతారాంపురం హైస్కూల్, మరిపెడ