గురుకులాలపై బాధ్యతేది? : పాపని నాగరాజు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పే అనేక అంశాల్లో గురుకుల విద్యావ్యవస్థ ఒకటి. అయితే వీటి నిర్వహణ రోజు రోజుకూ దిగజారుతున్నది. అడ్మిషన్లు మొదలు ఆధునిక భవనాలలేమి, నాసిరకం ఆహారం, నాణ్యతలేని చదువు, లోపించిన పర్యవేక్షణ ఇలా విద్యా వసతుల విషయంలో గురుకులాలు వెనుకబడి లోపభూయిష్టంగా నడుస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ విద్య పట్ల ఇష్టం పెరిగినప్పుడు పాలకులతో పాటు పాలనాయంత్రాంగం సైతం అందుకు తగినట్లు మలుచుకొని దాన్ని ప్రజలకు అందించాలి. వివిధ సంక్షేమ హాస్టళ్లను క్రమంగా ఒకవైపు ఎత్తివేస్తూ మరోవైపు కొన్నింటిని కుదిస్తున్నది ప్రభుత్వం. అయితే వాటిని ఎత్తేయడంలో ఉద్దేశం వేరే ఉన్నప్పటికి, ఏకోపాధ్యాయ బడులు అని, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిందని, ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదని వివిధ సాకులు చెబుతూ మూసివేస్తున్నారు. అసలు విద్యా ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణలాంటి వ్యవస్థలు మహానగరాలు, పట్టణాలను దాటి గ్రామాలను అలుముకున్న పరిస్థితిని ప్రమోట్‌ చేసేందుకే ఇలా చేస్తున్నామని పాలకులు చెప్పలేరు. 

అమానుష ఘటనలు

గురుకుల విద్యాసంస్థల్లో చదువు కోసం ఎదురుచూస్తున్న వారు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలు. వీటిలో అణగారిన కులాల, వర్గాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. అలాంటప్పుడు ఆ గురుకులాలను ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడే వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం పెరిగింది. ఎప్పటిలాగే విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లు ఎక్కాల్సి వస్తోంది. ఆధునిక భవనాల లేమి, వసతుల లేమి సహా.. తేళ్లు, పాములు కరిచి విద్యార్థులు మరణించినా అధికారులకు గానీ, ప్రభుత్వ అధినేతలకు గాని  లెక్కేలేదు. మైనార్టీ గురుకుల విద్యార్థినులు  చదువుకోవాల్సిన వయసులో గురుకులాల్లో తల్లులు అవుతుంటే పరిస్థితిని ఏమని అర్థం చేసుకోవాలి? గత విద్యా సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో మైనార్టీ గురుకుల విద్యార్థిని గురుకులంలోనే ప్రసవించిన ఘటన గురుకుల విద్యావ్యవస్థ తీరును నిలదీసింది. ఇలాంటి సంఘటనలు మానవత్వానికే మచ్చ అని గుర్తెరిగి అధికారులు, ప్రిన్సిపాల్, టీచర్లు బాధ్యతగా ఉండాలి కదా ? రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్ల అవసరాలని గుర్తుంచడమేనా వీరి బాధ్యత? భావి భారత నిర్మాణానికి ఆలవాలంగా ఉండి భవిష్యత్‌ సమాజాన్ని సామాజిక, ఆర్థిక, సాంస్కృతికంగా అభివృద్ధి చెందేందుకు పాటు పడాల్సిన నైతిక బాధ్యత వీరిది కాదా? ఇలాంటి ఘటనలు జరుగుతున్నా గురుకులాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాల్సిన అత్యున్నత బాధ్యతలున్న సెక్రటరీలు ఏమి చేస్తున్నట్లు? గురుకులాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ లక్ష్యాల పరికల్పన ఈ ప్రధాన అధికారులపైననే కదా ఉండేది? ఆ బాధ్యత అత్యున్నత అధికార్లకే లేనప్పుడు ఆర్‌సీవోలు, ఆర్‌ఎల్‌సీలు, ప్రిన్సిపాల్స్, వారి కింద పనిచేసే ఉపాధ్యాయులు ఏ మాత్రం బాధ్యతతో ఉంటారో మనకు అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని చక్కదిద్దాలంటే ఈ వ్యవస్థలోని పైస్థాయి అధికారులు అయిన కార్యదర్శుల నుంచి కింది స్థాయి అధికారులు అనునిత్యం ప్రతి గురుకులంలో ఆకస్మిక తనిఖీలు చేయాల్సి ఉంది. 

నాణ్యత లేని చదువులు

ప్రభుత్వం విద్య కోసం, ఆయా వర్గాల సంక్షేమం కోసం చేసే ఖర్చును తాము భవిష్యత్‌ తెలంగాణకు పెట్టుబడిగా చూస్తామని గొప్పగా చెప్పుకుంటున్నంత మేర నిధుల కేటాయింపు చేయడం లేదు. నిర్వహణ విషయంలో పైస్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించకపోవడం వల్ల వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఉదాహరణకు సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు ఆలంబనగా మారిన సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ సోసైటీ నిర్వహణకు ఒక సెక్రటరీగా ఒక అధికారి పూర్తి బాధ్యతలు నిర్వహిస్తేనే వీలుకాని పరిస్థితి. అలాంటిది ప్రస్తుతమున్న సెక్రెటరీకి ప్రభుత్వ నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత, అవసరం ఉండే ఫైనాన్స్‌ సెక్రెటరీగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. దాంతో గురుకుల సెక్రటరీగా ఆయన తన ప్రధాన విధులకు సమయం కేటాయించాల్సింది పోయి, రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతను చూసుకోవడమే సరిపోతున్నది. ఇక ఆయన గురుకులాలను సందర్శించడం అనేది ఊహించలేం. కాగా ఈ సంస్థలో ఉన్న డైరెక్టర్, డిఫ్యూటీ డైరెక్టర్, ఇతర అధికారులు అడ్మిషన్ల సమయంలో అడ్మినిస్ట్రేషన్‌కే పరిమితం అవుతున్నారు. కానీ విద్యార్థుల సమస్యలను, భవనాల నిర్వహణ, భోజనం, కనీస వసతులు, నాణ్యమైన చదువు తదితర అంశాలను పట్టించుకోవడం లేదు. కార్యదర్శి స్థాయి అధికారులు హైదరాబాద్‌లోని ఆయా సంస్థల కేంద్ర కార్యాలయాలకే పరిమితం అవడం, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేక పోవడం వల్ల ఆర్‌సీవో, ఆర్‌ఎల్‌సీలు, ప్రిన్సిపాల్​తో కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాలలో ప్రతిరోజు ఏదో ఒక చోట తమ సమస్యల పరిష్కారానికి స్టూడెంట్లు ఆందోళనలు చేస్తున్నారు. 

ALSO READ:జగిత్యాల జిల్లాలో కొత్త మండలంగా బండలింగాపూర్‌‌‌‌

కులతత్వాన్ని తట్టి లేపొద్దు

తెలంగాణ ఆవిర్భావం తరువాత విద్యార్థి సంఘాలను, విశ్లేషకులను, సామాజిక ఉద్యమ శక్తులను విద్యాలయాలలోనికి రానివ్వడం లేదు, దీంతో వాటిలో ఏం జరుగుతుందో ఆ నోట ఈ నోట సమాచారం తెలుస్తున్నదే తప్ప ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అసలు ఈ విద్యాసంస్థల్లో చదివేదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల పిల్లలు. ఇందులో చదువు చెప్పేది కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులే అధిక శాతం ఉంటారు. పాలకులకు లేకపోయినా కనీసం ఈ వర్గాల అధికారులు, ఉద్యోగస్తులకు నైతిక బాధ్యత ఉండాలి. 

మైనార్టీ, సాంఘిక, గిరిజన గురుకులాల కార్యదర్శులు, ఆయా శాఖ కమిషనర్లు, ప్రిన్సిపాల్స్‌, సెక్రటరీలు ఏదో ఒక గురుకులాన్ని ప్రతిరోజూ సందర్శించడం తప్పనిసరి చేయాలి. విద్యార్థులకు కేవలం విద్యే కాదు, నైతిక ప్రవర్తనకు సంబంధించిన విషయంలో కూడా విలువలు కొరవడుతున్నవి. మద్యం, డ్రగ్స్‌, ధూమపానం లాంటివి విద్యాలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పాలకులు తమ అధికారం కోసం కులం పునాదులను, పర మతద్వేషాన్ని ప్రేరేపించే విధంగా భావజాలం ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కులతత్వాన్ని ప్రేరేపించేదే. వీటి స్థానంలో ఇంటిగ్రేటెడ్‌ గురుకుల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో విద్యార్థులకు మానవతా విలువలు, నైతిక ప్రవర్తన, సామాజిక సృహలాంటి వాటిని అందించాల్సిన అవసరం ఉన్నది.

- పాపని నాగరాజు, అధ్యక్షుడు,  కుల నిర్మూలన వేదిక