కొబ్బరితో కోరినన్ని లాభాలు..కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి...

కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అని గౌరవంగా పిలుస్తారు. ఎందుకంటే ఆ చెట్టు వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కొబ్బరి నీళ్ల దగ్గర నుంచి పీచు వరకు ఎన్నో రకాల లాభాలున్నాయి. అటు ఆరోగ్యం, ఇటు సంపదకు తోడ్పడుతుంది. అలాంటి కొబ్బరి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా సెప్టెంబర్ 2వ తేదీన ‘వరల్డ్​ కోకోనట్​ డే’ చేస్తారు. ఆ సందర్భంగా కొబ్బరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి.

ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరి ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉన్న ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించిన దేశాల్లో ఈ కోకోనట్​ డే సెలబ్రేట్ చేస్తారు. కొబ్బరి వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడమే ఈ డే వెనక ఉన్న ఉద్దేశం. మొదటిసారి 2009 సంవత్సరంలో వరల్డ్​ కోకోనట్​ డే జరిగింది. ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఉన్న ఏసియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ (ఏపీసీసీ) ఈ డేని మొదలుపెట్టింది. ప్రతి ఏటా ఒక థీమ్​తో ఈ రోజుని సెలబ్రేట్ చేస్తారు. ఈ ఏడాది థీమ్–  ‘కోకోనట్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ : బిల్డింగ్ పార్ట్​నర్ షిప్​ ఆఫ్ మ్యాగ్జిమమ్ వ్యాల్యూ’.

మూడో స్థానంలో భారత్

కొబ్బరి చెట్టులో కాండం, కాయలు, ఆకులు, కొబ్బరి నీళ్లు, పీచు, కొబ్బరి పాలు, నూనె ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మరి ఈ కొబ్బరి పరిస్థితి మనదేశంలో ఎలా ఉంది? అన్ని కాలాల్లోను పంట ఇచ్చే చెట్టు కొబ్బరి చెట్టు. ప్రపంచదేశాల్లో కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉంది. కొబ్బరి డెవలప్ మెంట్ బోర్డు(CDB) మద్దతుతో కేరళ, తమిళనాడు, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కోకోనట్ డే సెలబ్రేట్​ చేస్తారు. అందు​లో భాగంగా కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి, వాడకానికి సంబంధించి ఎక్స్​పర్ట్స్​తో ప్రచార కార్యక్రమాలు చేస్తారు. కొబ్బరి ఉత్పత్తుల గురించి ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకుంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి కొబ్బరి : పచ్చి కొబ్బరి తినడం వల్ల డయాబెటిస్​ దరిచేరదు. నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. పలు రకాల క్యాన్సర్లతో పచ్చి కొబ్బరి పోరాడుతుంది. ఇందులో ఎక్కువగా ఉండే సెలీనియం, మెగ్నీషియం హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుంచి రిలీఫ్​ ఇస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణకు మేలు చేస్తుంది. 

ఎండు కొబ్బరి : ఇందులో ఉండే ప్రొటీన్స్, విటమిన్స్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ వైరల్ ఇన్ఫెక్షన్‌‌‌‌లు, చర్మ సమస్యల నుంచి రక్షిస్తాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్జీమర్స్ రాకుండా సాయపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. సంతానలేమి సమస్యకు చెక్ పెడుతుంది! 

కొబ్బరి నూనె : బరువు తగ్గడానికి సాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శీతాకాలంలో శరీరం పొడిబారకుండా కొబ్బరి నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు.. హానికారక క్రిములు చర్మానికి హాని కలిగించకుండా షీల్డ్​లా ఉంటుంది. 

కొబ్బరి నీళ్లు : కిడ్నీల్లో రాళ్లను కరిగించే శక్తి కొబ్బరి నీళ్లకు ఉంది. ఇన్​స్టంట్ ఎనర్జీ ఇస్తాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో డైజెషన్​కి మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. కండరాల తిమ్మిరి నుంచి రిలీఫ్​ వస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కాళ్లు, చేతుల వాపు తగ్గిస్తాయి.

ఇవేకాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కొబ్బరిని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కాకపోతే పోషకాహార నిపుణుల సలహా తీసుకుని మొదలుపెడితే అసలు ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

కొబ్బరి నేల..కేరళ!

కేరళ అనగానే కొబ్బరి చెట్లు, కొబ్బరి నూనెతో చేసే వంటలు గుర్తొస్తాయి. అంతెందుకు కేరళ అనే పేరు కూడా కొబ్బరి అనే అర్థాన్నిస్తుంది. ‘‘కేరా’’ అంటే కొబ్బరి, ‘‘ఆలం’’ అంటే నేల అని అర్థం. ఈ రెండు పదాల కలయికే  కేరళ. కేరళ అంటే కొబ్బరి నేల అన్నమాట అదే ఇంగ్లిష్​లో అయితే ‘ల్యాండ్​ ఆఫ్​ కోకోనట్స్’. 

ఉపాధి కల్పిస్తోంది

కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుంది. కాబట్టి కొబ్బరిని అనేక రకాలుగా వాడేందుకు రకరకాల పరిశ్రమలు కూడా వెలిశాయి.

ఫుడ్ ఇండస్ట్రీ : మలయాళ వంటల్లో ఇంపార్టెంట్ ఇంగ్రెడియెంట్ కొబ్బరి. లేత కొబ్బరి నీళ్లు కేరళలో ఎక్కువగా తాగుతారు. కొబ్బరి నూనెను వంట నూనెగా వాడతారు. పచ్చి లేదా ఎండు కొబ్బరి, కొబ్బరి పాలు వాడకుండా వంట పూర్తవ్వదు కేరళలో.

కొయర్ ఇండస్ట్రీ : ‘కొయర్’ అనే పేరు మలయాళ పదం ‘‘కయార్’’ నుంచి వచ్చింది. కొయర్ అంటే కొబ్బరి పీచు అని అర్థం. భారతదేశంలో, కొయర్ ఇండస్ట్రీని1859లో మొదటిసారి ఐరిష్‌‌‌‌కు చెందిన జేమ్స్ డర్రఘ్​ అలెప్పీలో మొదలుపెట్టాడు. కొబ్బరి పీచును కేరళలో ‘గోల్డెన్ ఫైబర్’ అని పిలుస్తారు. ఇది ఎకోఫ్రెండ్లీ ప్రొడక్ట్​ కూడా. కొయర్​ పరిశ్రమ కేరళలో అతిపెద్ద కుటీర పరిశ్రమ.

క్రాఫ్ట్ ఇండస్ట్రీ : వివిధ చేతిపనుల తయారీకి కొబ్బరి చిప్ప వాడతారు. కొబ్బరి చిప్పతో చేసిన గరిటెలు, స్పూన్లు కేరళలో ప్రతి ఇంట్లో ఉంటాయి. పెన్ స్టాండ్, హోల్డర్, లైట్లు మొదలైనటువంటి వస్తువులు తయారుచేసేందుకు కూడా దీన్ని వాడతారు.