లా చదువుతూ.. అన్నల్లో కలిసిండు

లా చదువుతూ.. అన్నల్లో కలిసిండు

హనుమకొండ, వెలుగు: లా చదువుతూనే అన్నల్లో కలిసిన ఓ మావోయిస్టు మూడేండ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. గురువారం వరంగల్ కమిషనరేట్​కాన్ఫరెన్స్​హాలులో సీపీ అంబర్​కిశోర్​ఝా మీడియా సమావేశంలో అతడి వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లికి చెందిన బుజగుండ్ల అనిల్​అలియాస్​క్రాంతికిరణ్​తల్లిదండ్రులు పీపుల్స్​వార్​గ్రూపులో పని చేశారు. నానమ్మ, తాత వద్ద పెరిగిన అనిల్​హైదరాబాద్‎లో ఎల్ఎల్​బీ చదువుతూనే మావోయిస్ట్​పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన డీఎస్ఈయూలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేశాడు. 

2021లో లా సెంకడ్ ఇయర్ చదువుతూనే మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు ప్రోత్సాహంతో దళంలోకి వెళ్లాడు. అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌‌ చంద్రన్న, కటకం సుదర్శన్‌‌ అలియాస్‌‌ ఆనంద్‎కు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ.. 2023లో చత్తీస్ గడ్‎లోని మడ్‌‌ ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. పార్టీ సెంట్రల్‌‌ కమిటీ సభ్యుడు,సెంట్రల్‌‌ రీజినల్‌‌ బ్యూరో కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్‌‌ అలియాస్‌‌ సోనుదాదా ఆధ్వర్యంలో పార్టీ ప్రచార కర్తగా కూడా పని చేశాడు. ఈ ఏడాది జులైలో అనిల్‌‌ను రాష్ట్ర కమిటీలో ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించగా.. జులై19న బీజాపూర్‌‌ జిల్లా పరిధిలోని సీమలదొడ్డి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రత్యక్షంగానూ పాల్గొన్నాడు. 


అనంతరం అగ్రనేతల ఆదేశాల మేరకు పార్టీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు, వ్యాసాలు, వీడియోలు, ఇంటర్నెట్ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించేవాడు. కొద్దిరోజులుగా అతను నరాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా చివరకు పోలీసులకు లొంగిపోయాడు. అతని పేరిట ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు ప్రకటించగా.. ఆ మొత్తాన్ని చెక్​రూపంలో సీపీ అంబర్​కిశోర్​ఝా అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​ డీసీపీ రవి, ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.