న్యూఢిల్లీ : ఇన్వెస్టర్ల దృష్టంతా మంగళవారం కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై ఉంది. దీనికి తోడు కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్, గ్లోబల్ అంశాలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు, డాలర్ మారకంలో రూపాయి ట్రెండ్, క్రూడాయిల్ ధరలపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ‘ఎకానమీ వృద్ధికి సపోర్ట్‌గా నిలిచే పాలసీలను రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు), డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (డీఐఐల) కదలికలపై ఆధారపడి మార్కెట్ డైరెక్షన్ ఉంటుంది’
అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అన్నారు. ఈ వారం బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ అండ్ టీ, డీఎల్‌ఎఫ్, టెక్ మహీంద్రా, నెస్లే కంపెనీలు తమ జూన్ క్వార్టర్ రిజల్ట్స్‌ను ప్రకటించనున్నాయి. కిందటి వారాన్ని సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 29 పాయింట్ల (0.11 శాతం) లాభంతో ముగించాయి.
కొనుగోలుదారులుగా ఎఫ్‌ఐఐలు..
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ. 30,772 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. సంస్కరణలు కొనసాగుతాయని, ఎకానమీ గ్రోత్ నిలకడగా ఉంటుందని, కంపెనీల రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మరోవైపు డెట్ మార్కెట్‌లో కూడా రూ.13,573 కోట్లను ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్ చేశారు.