మామిడికి ఫుల్ డిమాండ్..కిలో రూ.150

మామిడికి ఫుల్ డిమాండ్..కిలో రూ.150
  •   హోల్ సేల్ మార్కెట్‌‌లో టన్నుకు రూ.51 వేలు 
  •   దిగుబడి తగ్గడంతో పెరిగిన డిమాండ్ 

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి మామిడికాయలకు మస్తు గిరాకీ ఉంది. బహిరంగ మార్కెట్​లో మామిడి పండ్లు రూ.150 వరకు పలుకుతున్నాయి. ఇక హోల్ సేల్ మార్కెట్​లో మామిడికాయలు కిలోకు రూ.51 ధర ఉండగా, టన్ను రూ.51 వేల దాకా పలుకుతోంది. పోయినేడాది కరోనా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు, అయితే, ఈసారి సీజన్ ప్రారంభంలోనే మంచి ధర పలుకుతోంది. ఈ సీజన్ లో దిగుబడి తగ్గడంతోనే డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈసారి మార్చి నుంచే మార్కెట్​కు మామిడి వస్తోంది. పోయిన నెల మొదటి వారంలో టన్నుకు అత్యధికంగా రూ.89 వేల వరకు ధర పలకగా,  రెండో వారంలో రూ.83 వేల నుంచి రూ.88 వేల వరకు అమ్ముడైంది.  శుక్రవారం హైదరాబాద్​లోని గడ్డి అన్నారం మార్కెట్‌‌కు 200 టన్నుల వరకు బేనీషా రకం రాగా... టన్నుకు రూ.51 వేలు  పలికింది. పోయినేడాదితో పోలిస్తే ఈ రేటు చాలా ఎక్కువే. పోయినేడు కరోనా ఎఫెక్ట్ తో మామిడి టన్నుకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు మాత్రమే పలికింది. 

దిగుబడి 30 శాతం డౌన్..  

రాష్ట్రంలో 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా 12.70 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తోందని అంచనా. అయితే, ఈసారి వర్షాల వల్ల దిగుబడిపై ఎఫెక్ట్ పడింది. నవంబర్​లో కురిసిన భారీ వర్షాలతో పాటు డిసెంబర్‌‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచువల్ల మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. తేనె మంచు పురుగు ఆశించి పూత నల్లగా మారి రాలిపోయింది. రెక్కల పురుగుతో పాటు కాయపై మంగు తెగులు సోకడంతో దిగుబడి తగ్గింది. దాదాపు 30 శాతానికి పైగా దిగుబడి పడిపోతుందని, దాదాపు 4 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మన రాష్ట్రంలో వినియోగించే మామిడి కేవలం 22,857 టన్నులే కాగా.. మిగతా మొత్తం ఎగుమతి అవుతోంది.

కాయ పెరుగుతలే..  

పోయినేడు కరోనాతో తీవ్రంగా నష్టపోయినం. దిగుబడి తక్కువే వచ్చినా, ఎగుమతులు లేక తక్కువ ధరకే అమ్ముకున్నం. ఈసారి పూత బాగానే వచ్చినా, జనవరిలో అధిక మంచు వల్ల పూత రాలిపోయింది. ఉన్న కొంచెం కాపు కాసినా, కాయ పెరగడం లేదు. కాయ పెద్దగా అయితేనే  మంచి రేటు వస్తది. 15 ఎకరాల తోటకు ఇప్పటికే రూ.2 లక్షల పెట్టుబడి పెట్టినం. 
- మర్రి నర్సిరెడ్డి, రైతు, ఖమ్మం జిల్లా