ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా అభివృద్ధికి మాస్టర్‌‌ ప్లాన్‌‌ను పక్కాగా రూపొందించాలని కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌ ఆదేశించారు. కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీల అభివృ-ద్ధి కోసం మాస్టర్‌‌ ప్లాన్‌‌ తయారీపై గురువారం స్టేట్‌‌ హోల్డర్స్‌‌తో కలెక్టరేట్‌‌లో మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో సంబంధిత శాఖల వారీగా డేటాను మున్సిపల్‌‌ కమిషనర్లకు అందించాలని సూచించారు. ఈ వివరాల ప్రకారం హైదరాబాద్‌‌లోని నేషనల్‌‌ ఇన్సిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ అర్బన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందించనున్నట్లు చెప్పారు. అనంతరం వివరాల తయారీ విధానాన్ని జేడీటీపీ డి.రమేశ్‌‌బాబు, డీటీసీపీవో రాహుల్‌‌ పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌‌ఐయుఎం ప్లానర్‌‌ కొత్త శ్రీనివాస్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, వెంకారెడ్డి, కిశోర్‌‌కుమార్‌‌, సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్‌‌అండ్‌‌బీ ఈ‌‌ఈ యాకూబ్, పీఆర్‌‌ఈఈ శ్రీనివాస్‌‌రెడ్డి, అగ్రికల్చర్‌‌ ఏడీ రామారావునాయక్‌‌, కమిషనర్లు డి.మహేశ్వర్‌‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎలక్షన్‌‌ డ్యూటీ సరిగ్గా చేయాలి

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : మునుగోడు ఎలక్షన్‌‌ సిబ్బంది డ్యూటీ సరిగ్గా చేయాలని నల్గొండ కలెక్టర్‌‌ టి.వినయ్‌‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రిసైడింగ్‌‌, అసిస్టెంట్‌‌ ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న ట్రైనింగ్‌‌ను గురువారం అడిషనల్‌‌ కలెక్టర్లు రాహుల్‌‌శర్మ, భాస్కర్‌‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్‌‌ పనితీరుపై ఆఫీసర్లు అవగాహన కలిగి  ఉండాలన్నారు. ఎలక్షన్‌‌ కమిషన్‌‌ గుర్తించిన ఏదేని ఒక కార్డును చూపిన వారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. మాక్ పోలింగ్, పోలింగ్‌‌ ఇన్‌‌టైంలో నిర్వహించాలని చెప్పారు. పోలింగ్‌‌ అనంతరం చెక్‌‌ లిస్ట్‌‌ ప్రకారం తిరిగి అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్‌‌ కరణ్‌‌రెడ్డి, డీఈవో భిక్షపతి, మాస్టర్‌‌ ట్రైనర్లు తరాల పరమేశ్‌‌, బాలు పాల్గొన్నారు. అనంతరం నల్గొండకు వచ్చిన బైపోల్‌‌ అబ్జర్వర్‌‌ పంకజ్‌‌కుమార్‌‌కు కలెక్టర్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్లు స్వాగతం పలికారు.

ఎలక్షన్‌‌ ఖర్చును జాగ్రత్తగా పరిశీలించాలి

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : మునుగోడు ఎన్నికల్లో క్యాండిడేట్ల ఖర్చును నిశితంగా పరిశీలించాలని వ్యయ పరిశీలకురాలు ముళ్లపూడి సమత సూచించారు. గురువారం నల్గొండతో పాటు, చండూరు మండలం ఉడతలపల్లి, మునుగోడు మండలం గూడాపూర్‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెహికల్స్‌‌ను తనిఖీ చేసే టైంలో నంబర్‌‌, తేదీ, టైంతో పాటు ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న వివరాలను కూడా నమోదు చేయాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌‌ 1800 425 1442 నంబర్‌‌, చండూరు రిటర్నింగ్ ఆఫీసర్‌‌ ఆఫీస్‌‌లో ఏర్పాటు చేసిన 08681 268002 నంబర్‌‌కు తెలపాలన్నారు. ఆమె వెంట సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు సురేశ్‌‌ నాయక్‌‌ ఉన్నారు.

కార్మికులకు అండగా ఉంటా...

చౌటుప్పల్‌‌, వెలుగు : కార్మికులకు అండగా ఉంటానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తమ జీతాలు పెంచాలని, బోనస్‌‌ ఇవ్వాలని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌ మండలం ఎస్‌‌.లింగోటంలోని ప్రతిష్ట కంపెనీ కార్మికులు గత 22 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి గురువారం కార్మికులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంపెనీ ఓనర్లతో మాట్లాడి కార్మికులకు జీతాలు పెంచేలా ఒప్పించారు. దీంతో కార్మికులు సమ్మె విరమించి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు రెడ్డిబాయి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం, ఢిల్లీ మాధవరెడ్డి పాల్గొన్నారు.

నిఖిల్‌‌ మరణానికి కారణమైన వారిని అరెస్ట్‌‌ చేయాలి

సూర్యాపేట/హుజూర్‌‌నగర్‌‌, వెలుగు : సూర్యాపేటకు చెందిన గిరిజన యువకుడు నిఖిల్‌‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్‌‌ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌‌ చేశారు. సూర్యాపేటలోని పార్టీ ఆఫీస్‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. నిఖిల్‌‌ హత్య జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా నిందితులను ఇప్పటివరకు గుర్తించకపోవడం సరికాదన్నారు. పోస్ట్‌‌మార్టం రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. బాధిత ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌‌ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎల్గూరి గోవింద్‌‌, ఎం.శేఖర్, రజిత, వీరబోయిన రవి పాల్గొన్నారు. అలాగే హుజూర్‌‌నగర్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -నగేశ్‌‌ రాథోడ్‌‌ మాట్లాడారు. నిఖిల్‌‌ మరణానికి కారణమైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌‌ చేశారు. సమావేశంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వీనర్‌‌ బాణావత్‌‌ వెంకటేశ్వర్లునాయక్‌‌, భుక్యా నాగునాయక్, బాణావత్‌‌ శ్రీనునాయక్, మోతీలాల్‌‌నాయక్‌‌, తులసీనాయక్‌‌ తదితరులు పాల్గొన్నారు.

కుల వ్యవస్థ దిష్టిబొమ్మ దహనం

సూర్యాపేట, వెలుగు : విద్యార్థి, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేటలోని అంబేద్కర్‌‌ విగ్రహం వద్ద కులవ్యవస్థ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌‌ఎఫ్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, గిరిజన శక్తి నాయకులు వెంకటేశ్‌‌నాయక్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు గుండాల సందీప్, జనసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్‌‌ మాట్లాడారు. నిఖిల్ హత్య జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి దాసరి శ్రీను పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

  • భర్తే హత్య చేశాడంటున్నమృతురాలి బంధువులు
  •  మృతదేహంతో పోలీస్‌‌ స్టేషన్‌‌ ఎదుట ధర్నా

మునుగోడు, వెలుగు : ఒంటిపై గాయాలతో ఓ మహిళ చనిపోయింది. అయితే వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం, అదనపు కట్నం కోసం భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెంలో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన రూపని ఎల్లయ్య లక్ష్మమ్మ కూతురు చందన (27)కు రావిగూడేనికి చెందిన గుర్రం హరికృష్ణతో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, 9 నెలల కుమార్తె ఉన్నారు. వీరు హైదరాబాద్‌‌లోని అన్నోజిగూడలో ఉంటున్నారు. చందనకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని హరికృష్ణ అనుమానిస్తుండడంతో తరచుగా గొడవలు జరిగేవి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారికి సర్దిచెప్పి రావిగూడెం గ్రామానికి తీసుకొచ్చారు. తర్వాత అదనపు కట్నం ఇవ్వాలని హరికృష్ణ గొడవ పడుతుండడంతో చందన పేరెంట్స్‌‌ కొంత భూమిని ఆమె పేరున రిజిస్ట్రేషన్‌‌ చేసి, రూ. 10 లక్షలు ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం చందన ఇంట్లో పడిపోవడం, తలపై గాయాలు ఉండడంతో గమనించిన చుట్టుపక్కల వారు ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం, అదనపు కట్నం కోసం తమ అల్లుడే చందనను హత్య చేశాడని మృతురాలి తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా హరికృ-ష్ణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీస్‌‌ స్టేషన్‌‌ ఎదుట ధర్నా

చందన చనిపోయిన తర్వాత పోలీసులు పంచనామా నిర్వహించకుండానే డెడ్‌‌బాడీని పోస్టుమార్టంకు పంపుతుండడంతో మృతురాలి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. డెడ్‌‌బాడీతో పోలీస్‌‌ స్టేషన్‌‌ ఎదుట బైఠాయించారు. హరికృష్ణ చందనను చంపిన తర్వాత ఓ టీఆర్‌‌ఎస్‌‌ నాయకుడి ఆశ్రయించాడని, వారు పోలీసులు కుమ్మక్కై హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు వస్తున్నారంటూ పోలీసులు తమపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చందన మరణంపై పూర్తి స్థాయిలోవిచారణ చేయాలని డిమాండ్‌‌ చేశారు. 

‘బీసీలను మోసం చేశారు’

చండూరు (మర్రిగూడ), వెలుగు : మునుగోడులో 70 శాతం మంది బీసీలే ఉన్నారని, అయినా వారికి టికెట్‌‌ కేటాయించకుండా అన్ని పార్టీలు మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌ విమర్శించారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో గురవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కాదన్నారు. డబ్బులు, మద్యం పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కుక్కడపు ముత్యాలు, పగిళ్ల సత్యనారాయణ, నక్క శ్రీను, సైదులు గౌడ్, బేత వెంకటేశ్‌‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ ఓటమిని ఒప్పుకుంది

మునుగోడు, వెలుగు : టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికలో ఓటమిని అంగీకరించిందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులందరిని మునుగోడులో దింపారని, ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామానికి రావడానికి సిద్ధమైనప్పుడే వారు ఓడిపోయారని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎంతమంది తిరిగినా బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు వచ్చినా ప్రజలు బహుజనున్ని గెలిపించుకోవాలని చూస్తున్నారన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండో రోజులో భాగంగా మునుగోడు మండలంలోని వెల్మకన్నె, చల్మెడ, కొంపల్లి , పలివెలతో పాటు పలు గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. వెల్మకన్నెలో పేదలకు ప్రభుత్వం 50 ఏండ్ల కింద ఇచ్చిన ఇండ్ల స్థలాలను కేసీఆర్​ప్రభుత్వం గుంజుకోవడాన్ని నిలదీశారు. పేదల భూములను పేదలకే ఇచ్చి ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత స్థానిక ప్రైమరీ స్కూల్​ను విజిట్​చేశారు. ఈ సందర్భంగా వందల మంది విద్యార్థులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయని వాపోయారు. టీఆర్ఎస్ నామినేషన్ కార్యక్రమానికి జనాలు రాకపోతే ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చి తెచ్చుకున్నారన్నారు. కమ్యూనిస్టులు దొరలకు మద్దతు తెలపడం చూసి మార్క్స్, ఏంగిల్స్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు ఏడుస్తుంటారని విమర్శించారు. మహిళా కన్వీనర్ నర్ర నిర్మల, జిల్లా లీడర్లు భీం ప్రసాద్, మండల నాయకులు హరీశ్, వెంకన్న, సురేశ్​పాల్గొన్నారు.

నమ్మి అధికారమిస్తే నట్టేట ముంచిన్రు

యాదగిరిగుట్ట, వెలుగు : ఉద్యమనేత అని నమ్మి కేసీఆర్‌‌కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నట్టేట ముంచారని పీసీసీ మెంబర్, కాంగ్రెస్‌‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌చార్జి బీర్ల అయిలయ్య విమర్శించారు. తన కుటుంబ సభ్యులు, అనుచరులకు పదవులు ఇచ్చుకున్న కేసీఆర్‌‌ నిరుద్యోగులను మాత్రం కూలీ పనులు చేసుకోవాలని చెబుతున్నారన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో గురువారం పలువురు కాంగ్రెస్‌‌లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేని కేసీఆర్‌‌ బీజేపీతో కొట్లాడుతున్నట్లు నటిస్తూ డైవర్షన్‌‌ పాలిటిక్స్‌‌ చేస్తున్నారన్నారు. కేసీఆర్‌‌ డ్రామాలను గమనించిన ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ యేమాల ఎలేందర్‌‌రెడ్డి, మిల్క్‌‌ సెంటర్‌‌ చైర్మన్‌‌ మోటె భాస్కర్‌‌ పాల్గొన్నారు. అనంతరం మాసాయిపేటలో చనిపోయిన వాకిటి చంద్రయ్య, బాహుపేటలో మచ్చ శ్రీశైలం ఫ్యామిలీలను పరామర్శించారు. 

బీజేపీని ఓడించేందుకే టీఆర్‌‌ఎస్‌‌తో కలిశాం

నల్గొండ, వెలుగు : ఆదానీ, అంబానీకి కొమ్ముకాస్తున్న బీజేపీ ఓడించాలన్న లక్ష్యంతోనే టీఆర్‌‌ఎస్‌‌తో కలిసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. నల్గొండ జిల్లా చండూరులో గురువారం జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు తప్పవని హెచ్చరించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేసి, వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, రైతులను బిచ్చగాళ్లుగా మార్చే చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్యాంగ చట్టాలను రద్దు చేసి మను ధర్మశాస్త్రం తేవాలని చూస్తున్న పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు. అనంతరం విద్యుత్‌‌ శాఖ మంత్రి జగదీశ్‌‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి 18 వేల కోట్లకు అమ్ముడుపోతే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఎనిమిదేళ్ల క్రితం మునుగోడు ఫ్లోరైడ్‌‌కు కేరాఫ్‌‌గా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ మిషన్‌‌ భగీరథ పథకం తీసుకురావడం వల్లే ఫ్లోరైడ్‌‌ సమస్య తగ్గిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మతతత్వ బీజేపీ కరోనా కంటే ప్రమాదకరం అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్‌‌ఎస్‌‌ను గెలిపించాలని కోరారు. అనంతరం మునుగోడు టీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టుల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్‌‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. 2014లోనే మునుగోడు నియోజకవర్గం అభివృ-ద్ధి చెందిందని, రాజగోపాల్‌‌రెడ్డి గెలిచాక చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఇప్పటివరకు ఆగిపోయిన పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. తాను లోకల్‌‌ అని, రాజగోపాల్‌‌రెడ్డి నాన్‌‌ లోకల్‌‌ అని చెప్పారు.

‘టీఆర్‌‌ఎస్‌‌కు ఓట్లు అడిగే హక్కు లేదు’

చౌటుప్పల్‌‌, వెలుగు : రైతులను మోసం చేస్తున్న టీఆర్‌‌ఎస్‌‌కు మునుగోడులో ఓట్లు అడిగే హక్కు లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌లో గురువారం జరిగిన రాష్ట్ర కిసాన్‌‌ మోర్చా పదాధికారుల మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. రూ. లక్ష రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని, ఫసల్‌‌ బీమా అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.  అనంతరం బీజేపీ కిసాన్‌‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా సీఎం కేసీఆర్‌‌ అడ్డుకుంటున్నారని విమర్శించారు. భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్‌‌ హెల్త్‌‌ కార్డు ఇచ్చేందుకు కేంద్రం రూ. 300 కోట్లు ఇస్తే, ఆ నిధులను సీఎం కేసీఆర్‌‌ పక్కదారి పట్టించారని ఆరోపించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బోగి మధుసూదన్‌‌రెడ్డి, పాపయ్యగౌడ్, కిసాన్‌‌ మోర్చా ప్రధాన కార్యదర్శులు జగన్‌‌ మోహన్‌‌రెడ్డి, అంజన్న యాదవ్, కిరణ్‌‌గౌడ్‌‌, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణతాపడానికి 33 తులాల బంగారం విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన గోపుర బంగారు తాపడం కోసం ఓ రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌ 33 తులాల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ గోల్డ్‌‌ను గురువారం ఏఈవో గజవెల్లి రఘు, ప్రధానార్చకుడు మోహనాచార్యులుకు అందజేశారు. అనంతరం ఫ్యామిలీతో కలిసి నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఏఈవో గజవెల్లి రఘు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, టెంపుల్‌‌ ఇన్స్‌‌పెక్టర్‌‌ డంగు శ్రావణ్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.

ఎన్‌‌ఎంఎం స్కాలర్‌‌షిప్‌‌కు అప్లై చేసుకోండి

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : నేషనల్‌‌ మీన్స్‌‌ కమ్‌‌ మెరిట్‌‌ స్కాలర్‌‌షిప్‌‌ కోసం స్టూడెంట్లు అప్లై చేసుకోవాలని నల్గొండ డీఈవో బొల్లారం భిక్షపతి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించిన జనరల్‌‌, బీసీ, 50 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లు స్కాలర్‌‌షిప్‌‌కు అర్హులన్నారు. అన్ని సర్టిఫికెట్లతో ఈ నెల 28 లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీహెచ్‌‌సీలు రూ.50, బీసీ, జనరల్‌‌ స్టూడెంట్లు రూ.100 ఫీజు కట్టాలని పేర్కొన్నారు.

హనుమంతరెడ్డి ఫ్యామిలీకి పరామర్శ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపూర్‌‌కు చెందిన టీఆర్ఎస్‌‌ నాయకుడు చంద్రశేఖర్‌‌రెడ్డి తండ్రి హనుమంతరెడ్డి ఇటీవల చనిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌రెడ్డి గురువారం గ్రామానికి వెళ్లి మృతుడి ఫ్యామిలీని పరామర్శించారు. అనంతరం హనుమంతరెడ్డి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్యకర్తల ఫ్యామిలీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, వాసాలమర్రి ఎంపీటీసీ పలుగుల నవీన్‌‌కుమార్‌‌, తుర్కపల్లి మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌‌రెడ్డి, వైస్‌‌ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి, మండల కోఆప్షన్‌‌ మాజీ సభ్యుడు ఎండీ.యాకూబ్ పాల్గొన్నారు.

కేటీఆర్ కాన్వాయ్ తో భారీ ట్రాఫిక్ జామ్

చౌటుప్పల్, వెలుగు : మంత్రి కేటీఆర్​పర్యటన నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం హైవేపై భారీ ట్రాఫిక్​జామ్ ఏర్పడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చౌటుప్పల్ మీదుగా చండూరుకు వచ్చారు. చౌటుప్పల్‌లో టీఆర్ఎస్​శ్రేణులు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్ ఉన్నంత సేపు జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. కేటీఆర్​కాన్వాయ్ వెళ్లాక ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు అరగంటకు పైగానే పట్టింది.