- ఎస్టీల్లో చేర్చి, పోడు సాగుకు ఛాన్స్ఇవ్వాలని రోడ్డెక్కెతున్న కాయితీ లంబాడీలు
- ట్రెంచ్ వేస్తామని హామీ ఇచ్చి, వేరేవారికి సాగుకు ఛాన్స్ఇస్తున్నారంటూ ఎక్కపల్లిలో నిరసన
కామారెడ్డి, వెలుగు : పోడు పట్టాల పంపిణీ వ్యవహారం కామారెడ్డి జిల్లాలో రోజుకో కిరికిరి పెడుతోంది. అర్హులైన తమకు పట్టాలివ్వలేదని ఎస్టీలు కొన్ని చోట్ల ఆందోళన చేస్తుంటే, తమని ఎస్టీలో చేర్చి పోడు పట్టాలివ్వాలని కాయితీ లంబాడీలు రోడ్డెక్కుతున్నారు. ఫారెస్ట్ భూముల్లో సాగుకు ప్రయత్నించిన తమను అడ్డుకొని, ఆ భూముల్లోనే ఇతరులకు పట్టాలు ఇస్తున్నారని మరికొందరు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో 395 గ్రామాల పరిధిలో పోడు భూములున్నాయి. పట్టాల కోసం 27 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 11,365 మంది గిరిజనులు 30,664 ఎకరాల కోసం, 15,710 మంది గిరిజనేతరులు 37,651 ఎకరాల కోసం దరఖాస్తులు సమర్పించారు. ఆఫీసర్లు పరిశీలించి 4 వేల అప్లికేషన్లు క్లియర్‌గా ఉన్నట్లు తేల్చారు. వీరికి ఇటీవల పోడు పట్టాలిచ్చారు.
తాము అర్హులైనప్పటికీ పోడు పట్టాలివ్వలేదంటూ మాచారెడ్డి, గాంధారి మండలాలకు చెందిన పలువురు ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. మాచారెడ్డి మండలంలో కొందరు ఎస్టీలు భూమిని దున్నేందుకు ప్రయత్నించగా, ఫారెస్ట్ఆఫీసర్లు వెళ్లి అడ్డుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. లింగంపేట మండలం ఎక్కపల్లి శివారులోని ఫారెస్ట్భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని ట్రెంచ్ కొట్టిస్తామని ఆఫీసర్లు హామీ పత్రం రాసి ఇచ్చి, అదే భూమిలో పోడు పట్టాలు ఇవ్వడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాయితీ లంబడీల నిరసన
కామారెడ్డి జిల్లాలో గాంధారి, పిట్లం, బిచ్కుంద, లింగంపేట మండలాల్లో కాయితీ (మథుర) లంబాడీలు ఎక్కువగా ఉన్నారు. వీరు ఏండ్లుగా తండాల్లో ఉంటూ వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం వీరిని బీసీలుగా గుర్తించడంతో ఇటీవల పోడు పట్టాల పంపిణీలో అవకాశం కల్పించలేదు. తండాల్లో ఉంటూ ఏండ్ల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న తమకు కూడా పట్టాలివ్వాలంటూ వీరు ఆందోళన బాటపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తమను ఎస్టీలో చేర్చి, పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ ముందు ధర్నాతో పాటు పలు చోట్ల పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేశారు. కాయితీ లంబాడీలను ఎస్టీల్లో చేర్చి, పోడు పట్టాలివ్వాలనే అంశాన్ని ఇటీవల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో ఎస్టీ వర్గానికి చెందిన గిరిజనుల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తాకింది.
ఎక్కపల్లిలో ఉద్రిక్తత
లింగంపేట మండలం ఎక్కపల్లి, ఎక్కపల్లి తండా శివారులోని ఫారెస్ట్భూమిలో పోడు వ్యవసాయం జరుగుతోంది. కొన్నాళ్ల కింద గ్రామస్తులు ఫారెస్ట్ల్యాండ్లో సేద్యం చేయడానికి ప్రయత్నించగా, ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఈ ఏరియాలో ఎవరికీ పోడు పట్టాలివ్వొద్దని, ఫారెస్ట్ ల్యాండ్ చుట్టూ ట్రెంచ్ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. దీంతో ఫారెస్ట్ఆఫీసర్లు స్థానికులకు హామీ పత్రం రాసిచ్చారు. ఇటీవల ఎక్కపల్లి తండాకు చెందిన పలువురికి ఇక్కడ130 ఎకరాల్లో పోడు పట్టాలు పంపిణీ చేశారు. తాము ఫారెస్ట్భూముల్లో సాగు చేస్తామంటే అడ్డుకొని, ఇప్పుడు మళ్లీ పట్టాలివ్వడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు.
4 రోజుల కింద ఇదే గ్రామానికి చెందిన పలువురు ఫారెస్ట్‌లో పొదలు కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు, ఫారెస్ట్, పోలీస్ యంత్రాంగం మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు రాత్రి టైమ్‌లో గ్రామానికి కరెంట్సప్లయ్ బంద్ చేసి స్థానికులపై లాఠీలతో ప్రతాపం చూపారు. గ్రామస్తులు సైతం పోలీసు వెహికల్‌పై రాళ్లతో దాడి చేశారు. ఘటనలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.