న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం 8 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాబోయే 4 రోజులు కూడా తీవ్రమైన వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల పైనే నమోదవుతుందని హెచ్చరించింది. ఆదివారం ముంగేష్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 48.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 48.1 డిగ్రీలతో నజాఫ్‌గఢ్ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే నమోదు అవుతోంది.
రాబోయే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల వద్ద కొనసాగుతుందని, ఆ తర్వాత గురువారం ఒక డిగ్రీ తగ్గి.. శుక్రవారం 44 డిగ్రీలకు చేరుకొని.. శని, ఆదివారాల్లో 43 డిగ్రీలకు తగ్గుతుందని వెల్లడించింది. శుక్రవారం తేలికపాటి వర్షం కురుస్తుందని, మరుసటి రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూ, హిమాచల్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాజస్థాన్‌లోని ఫలోడిలో ఆదివారం దేశంలోనే అత్యధికంగా 49.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.