హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. మార్చి 18 వరకూ జర జాగ్రత్త..!

హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. మార్చి 18 వరకూ జర జాగ్రత్త..!

హైదరాబాద్: భాగ్యనగరంపై భానుడి ప్రతాపం మొదలైంది. మార్చి 18 వరకూ హైదరాబాద్ నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో రానున్న నాలుగు రోజులు ఎండ మంట మండించడం ఖాయమని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కూకట్పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలతో పాటు అన్ని సిటీ జోన్లలో ఎండలు మంట పుట్టిస్తాయని ఐఎండీ అలర్ట్ చెప్పకనే చెప్పింది.

Also Read:-గతంలో అలా చేసినందుకు క్షమించండి అంటూ సుప్రీత వీడియో.. 

మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. నిరుడు ఇదే టైమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి.

18 జిల్లాల్లో 41 డిగ్రీలకు టెంపరేచర్లు చేరువయ్యే అవకాశం ఉన్నట్టు తెలంగాణ డెవలప్మెంట్​అండ్​ ప్లానింగ్​ సొసైటీ (టీజీడీపీఎస్​) అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, జనగామ, వరంగల్​, ములుగు, హనుమకొండ, జయశంకర్​ భూపాలపల్లి, కరీంనగర్​, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే చాన్స్​ ఉన్నట్టు అంచనా వేసింది. కాగా, ఆగ్నేయ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజులు 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.