- ఉపాధి హామీ స్కీమ్‌కు మెదక్ చర్చే స్ఫూర్తి
- రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తం: సీఎం రేవంత్
- మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరు
- ఏడుపాయల వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
మెదక్/పాపన్నపేట, వెలుగు: వందేండ్ల కింద ప్రజలు కరవు కాటకాలతో, ఆకలి దప్పులతో అలమటిస్తున్న సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు పనికి ఆహార పథకం కింద మెదక్ లో చర్చి నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి మెదక్ చర్చి నిర్మాణమే స్ఫూర్తి అని ఆయన చెప్పారు. బుధవారం మెదక్ కెథడ్రల్ చర్చి శతాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇన్చార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ప్రార్థనలు నిర్వహించి ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. దేశంలో గొప్ప దేవాలయంగా ఫరిడవిల్లుతున్న మెదక్ చర్చి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మెదక్ చర్చితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘గతంలో పీసీసీ అధ్యక్షుడిగా చర్చిని సందర్శించినప్పుడు.. వచ్చే ఏడాది సీఎం హోదాలో మళ్లీ వస్తానని భక్తులను మాటిచ్చాను. ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయి మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో చర్చిని మరింత అద్భుతంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విజ్ఞప్తి మేరకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశాం. మాది ప్రజల, రైతుల ప్రభుత్వం” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
దళిత క్రిస్టియన్లు, గిరిజనులకే ఎక్కువ లబ్ధి
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దళిత క్రిస్టియన్లు, గిరిజనులకు ఎక్కువ లబ్ధి కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. అందుకే రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇండ్లకు 200 యూనిట్ల దాకా ఉచిత కరెంట్, రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నామని, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని, రూ.21 వేల కోట్ల పంట రుణ మాఫీ చేశామని, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి చిత్త శుద్ధితో కృషిచేస్తామని ఆయన తెలిపారు. జిల్లాకు ఏ అవసరం ఉన్నా జిల్లాకు చెందిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకొస్తే మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు చర్చి ప్రాంగణంలో రూ.29.18 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
ఏడుపాయల వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గమ్మ సన్నిధిలో రూ.297 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి తొలిసారిగా ఏడుపాయలకు వచ్చిన సీఎంకు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వన దుర్గమ్మకు సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించారు. అనంతరం మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో రూ.205 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి.. రూ.52 కోట్లతో గిరిజన తండాల్లో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల పనులకు.. రూ.35 కోట్లతో ఏడుపాయల్లో చేపట్టే రెండు వరసల రోడ్డు, డివైడర్, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులకు.. మెదక్ పట్టణంలో రూ.5 కోట్లతో చేపట్టే ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలోని 886 సెల్ప్ హెల్ప్ గ్రూపులకు రూ.102 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు తదితరులు పాల్గొన్నారు.