హై బీపీతో పడిపోగా.. గెంటేసిన్రు.. వృద్ధురాలిపై వైద్య సిబ్బంది అమానుషం

హై బీపీతో పడిపోగా.. గెంటేసిన్రు.. వృద్ధురాలిపై వైద్య సిబ్బంది అమానుషం

జగిత్యాల, వెలుగు: చికిత్స పొందుతున్న భర్తకు సాయంగా ఉండేందుకు వచ్చిన వృద్ధురాలు బీపీ వచ్చి బెడ్‎పై పడిపోగా..  వైద్య సిబ్బంది బయటకు వెళ్లగొట్టిన ఘటన జగిత్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే..  గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురై వారం రోజుల కింద జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో చేరాడు. అతనికి సాయంగా భార్య మల్లవ్వ వచ్చి ఉంటోంది. రెండు రోజులుగా ఆమె హై బీపీతో బాధ పడుతూ గురువారం సొమ్మసిల్లి భర్త బెడ్ పక్కన మరో బెడ్‎పై  పడిపోయింది. 

ఆస్పత్రి సిబ్బంది ఆమెను వీల్ చైర్‎లో తీసుకెళ్లి బయట రోడ్డుపై పడేశారు. భార్యను బయటకు వెళ్లగొట్టినది తెలుసుకుని భర్త ఆమె వద్దకు వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులను చూసిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లి బాధిత దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‏ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ  ఆసుపత్రి సిబ్బంది వైఖరి మార్పు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.